ఈ పుట ఆమోదించబడ్డది

40.తే.లే దభిక్రమనాశంబులేశమేని;
కల్గ దేదోష మిట్టి యోగంబువలన;
మనుజునకుఁ గర్మయోగ ధర్మం బొకింత
చాలు దాఁటింపఁ జేయ సంసారభయము.

41. తే. జనులలో మోక్షమందే యాశయము నిల్పు
వారి దౌ బుద్ధి యొక్కటే పాండవేయ!
వేఱభిప్రాయములు గల్గు వారి కెల్ల
బుద్ధి శాఖోపశాఖలై పోవుచుండు.

42. ఆ. స్వర్గ తుల్యమైన సౌఖ్యంబు లేదంచు
వేదవిదుల కిట్లు విదిత మనుచు
జ్ఞానశూన్యు లగుచుఁ గమనీయపుష్పసం
తతుల సరణిఁ బల్కి తనరుజనులు.

43. తే. స్వర్గకామాత్ము లౌవారి భాషణములు
జన్మకర్మఫలాదు లొసంగునవియుఁ
బెక్కుక్రియలచే నతిశయింపించునవియు
నిహసుఖంబులు భోగంబు లిచ్చునవియు.

44. తే. ఇట్టి కోర్కులచే నపహృతమనస్కు
లైనవారలు భోగేచ్ఛలాశ్రయింత్రు;
వారిమనసున కెన్నండు పట్టువడదు
ఆత్మవిజ్ఞానదాయికంబైనబుద్ధి.

45. తే. వేదము లనంగఁ ద్రైగుణ్య విషయికములు;
వాని మూఁటిని వర్జింప వలయుఁ బార్థ !
ద్వంద్వములు వీడి నిత్య సత్త్వము ధరించి
క్షేమమును లాభమును నుపేక్షింపవలయు.