ఈ పుట ఆమోదించబడ్డది

21. తే.ఆత్మ నవినాశుఁడును నిత్యుఁడజుఁడు మరియు
నవ్యయుండని హర్షించునట్టిపురుషు
డెట్టు లవ్వాని హింసింపనెంచఁగలఁడు?
హింసఁ జేయించుటకు నైననెట్లు దలఁచు?

22. ఆ. జీర్ణమైనయట్టి చేలము ల్విడఁదీసి
క్రొత్తవాని నరుఁడు గొనినయట్లె
దేహి జీర్ణమైన దేహంబులను వీడి
క్రొత్త దేహములనుగొనును బార్ధ !

23. తే. ఆయుధంబులు ఛేదింపవాత్మ నెపుడు;
వహ్నివలన దహింపఁగావలనుపడదు;
జలము లైన్నైనఁ దడుపగాఁజాల వతనిఁ
బవనుచేతను శోషింపఁ బడఁ డతండు.

24. తే. దహన మందఁ డతండు, ఛేదనముఁగనఁడు,
తడుపఁబడఁ డెండిపోఁడు, నిత్యుఁడును, సర్వ
జగములందును వ్యాపింపఁజాలువాఁడు
స్థాణుఁ డచలుం డనాది యాతండు పార్థ !

25. తే. వ్యక్త మొనరించుటకు సాధ్యపడదు వానిఁ
జింతసేయ నసాధ్యం బొకింతయేని
నంట వతని వికారంబు లందువలన
వానికై యేల దుఃఖింపవలయుఁ బార్థ !

26. తే. అట్లు గాకుండ వాఁడు నిత్యంబుఁ బుట్టి
నిత్యమును జచ్చు నం చననేర్తు వేని
నావిధంబున నైన నీవతనికొఱకు
దుఃఖపడ నేల చెప్పుమా దురితదూర!