ఈ పుట ఆమోదించబడ్డది

30.ఆ. ఇది ప్రవృత్తి యనుచు నిది నివృత్తియటంచుఁ
గార్య మనుచు మఱి యకార్య మనుచు
భయము నభయ మనుచు బంధమోక్షము లంచుఁ
బోల్పఁగలది సత్త్వబుద్ధి పార్థ!

31. ఆ. ధర్మమనియు మఱి యధర్మం బటనియును
గార్య మనియు మఱి యకార్య మనియు
నిశ్చయంపురీతి నిర్ణయింపఁగ లేని
బుద్ధి రాజసంబు పుణ్యచరిత !

32. కం. తమసావృత మగుట, నధ
ర్మము ధర్మ మటంచు నెంచి మఱియున్‌ సర్వా
ర్థములను వానికి విపరీ
తములుగఁ గనిపించుబుద్ధి తామసమ యగున్‌.

33. తే. అలమనఃప్రాణముల యింద్రియములయొక్క
వృత్తులనుబట్టి నిలువంగఁ బెట్టఁగలిగి
యోగ మవ్యభిచార మైయుండు తెఱఁగు
చేయుధృతిసాత్త్వికం బని చెప్పవలయు.

34. కం. ఫలకాంక్షతోడఁ బురుషుం
డిల ధర్మార్థముల కామమెక్కుడుసంగం
బొలయ నొనర్పఁగఁ జేయం
గలధృతి రాజస మటండ్రు కవ్వడి! విబుధుల్‌.

35. తే. స్వప్నభయశోకములును విషాదమదము
లాదిగాఁ గల్గు విషయంబులందు మదిని
విడువకుండఁగ నిల్పుదుష్టుఁడు ధరించు
ధృతిని దామస మండ్రు సురేంద్రతనయ!