ఈ పుట ఆమోదించబడ్డది

18.తే. అట్టివార లహంకార మతిశయింప
బలముఁ గ్రోధంబుఁ గామదర్పములఁ బూని,
తమతనువులందుఁ బరశరీరములయందుఁ
జెలఁగునన్ను ననూయ ద్వేషించుచుంద్రు.

19. తే. క్రూరులును ద్వేషులును శుభదూరులు నగు
నానరాధము లాసురయోనులందె
త్రోయఁగాఁబడి సంసార దుఃఖగతులఁ
బొందునట్టులు నేఁ జేయుచుందు నెపుడు.

20. తే. అసురయోనుల జనియించు నట్టివారు
జన్మజన్మంబునకును నజ్ఞాను లగుచు
నన్నుఁ బొందెడుజ్ఞానంబు తెన్నుఁ గనక
యంతకంతకుఁ జనుచుందు రధమగతికి.

21. తే. ఆత్మనాశనకర మైన యాసురస్వ
భావ నరకంబునకు మూఁడు త్రోవ లుండుఁ
గ్రోధకామంబులను లోభ గుణము ననఁగ;
వాని మూఁటిని వర్జింప వలయుఁ బార్థ!

22. తే. ఈతమోద్వారముల మూఁటి నేనరుండు
విడుచు, నాతనియాత్మ కేర్పడు శుభంబు,
ఫల్గునా ! యట్లు సేయుటఁ బరమపదముఁ
బొందుటకుఁ దగునర్హతఁ జెందు నతఁడు.