ఈ పుట ఆమోదించబడ్డది

ఓమ్‌

శ్రీకృష్ణపరబ్రహ్మణేనమః

శ్రీమద్భగవద్గీత

షోడశాధ్యాయము.

దైవాసుర సంపద్విభాగ యోగము


శ్రీ భగవంతుడిట్లనియె :-

01. తే. అభయమును జ్ఞానయోగంబునందునికియు
సత్త్వసంశుద్ధి దమము యజ్ఞంబు తపము
దాన మొసఁగుట మఱియు స్వాధ్యాయనిష్ఠ
తలఁపునందును గ్రియలందు ధర్మపథము.

02. తే. సత్య మక్రోధమును ద్యాగశాంతములును
మఱి యహింసయు దాతృత్వ మార్దవములు,
విషయ నిస్స్పృహయును లజ్జ పెంపు భూత
జాలమందలిదయము న చాపలంబు.

03. తే. క్షమము తేజస్సు ధృతియు శౌచంబు మఱియు
ద్రోహగర్వంబులను వీడఁ ద్రోయుటయును
దైవసంబంధమైన యుద్భవమునందు
జనులసహజగుణంబులు సవ్యసాచి!

04. తే. దంభ పారుష్యములను గ్రోధాభిమాన
ములును నజ్ఞానమును దర్పమును దదాదు
లైనగుణములు సహజంబులగును నసుర
సంపదను జన్మమందెడు జనుల కెల్ల.

05. తే. దేవసంపద మోక్షంబుఁ దెచ్చి యిచ్చు;
నసురసంపద బంధంబులంటఁగట్టు;
పార్థ! నీజన్మ, దైవసంపదయె కనుక,
ఈవు దుఃఖింపవలసిన దేమిలేదు.