ఈ పుట ఆమోదించబడ్డది

18.తే. అక్షరునికంటె శ్రేష్ఠుండనగుట వలన
క్షరునకంటె నతీతుండఁ గాన, నెల్ల
స్మృతులయందును శ్రుతులఁ బ్రసిద్ధి గాఁగ,
ఏన పురుషోత్తముఁడ నందు రెల్లబుధులు.

19. తే. ఎవఁడు పురుషోత్తమునిఁ గాఁగ నెఱిఁగి మౌఢ్య
మెల్ల విడనాడి భజన నన్నే యొనర్చు,
వాఁడు భజయించు సర్వభావముల నన్ను;
వాని సర్వజ్ఞుఁ డని చెప్పవలయుఁ బార్థ!

20. ఆ. అవని మిగల గుహ్యమైనశాస్త్రంబు నా
వలన నీకుఁ జెప్పఁ బడియె నేఁడు;
దీని నెఱుఁగువాఁడు కృతకృత్యుఁ డగు, మఱి
బుద్ధిమంతుఁ డగును, సిద్ధిఁ బొందు.


బ్రహ్మవిద్యాశాస్త్రమైన భగవద్గీతలోని

పదహైదవ అధ్యాయము పురుషోత్తమప్రాప్తి యోగము సమాప్తము.