ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ భగవంతుడిట్లనియె :-

22. తే. తనకు సంప్రాప్త మౌపదార్థ ముల యెడల
నగుప్రకాశ ప్రవృత్తి మోహములయందు
నెవఁడు ద్వేషంబు గొనఁడొ; నివృత్తియైన
వాని నెవ్వఁడు మరలఁ గావలయు ననఁడొ.

23. తే. సర్వవిషయంబులం దటస్థత వహించి
యెవఁడు గుణములచేఁ జలియింపఁ బడఁడొ
ప్రతిదియును గుణములప్రవర్తనమె యంచుఁ
దలఁచి యెవ్వనిబుద్ధి నిశ్చలతఁ గనునొ.

24. తే. సుఖము దుఃఖంబు సమముగాఁ జూచు నెవఁడు
స్వర్ణ లోష్ట శిలల్‌ గను సమత నెవఁడు
తుల్యుఁ డై ప్రీతి యప్రీతి స్తుతియు నింద
యెల్లఁ గని స్థిరచిత్తుఁ డై యెసఁగు నెవఁడు

25. తే. అరుల మిత్రుల మఱియు మా నావమాన
ముల నెవండు సమంబుగాఁ దలఁచుచుండు
నెల్ల కామ్యకర్మములఁ ద్యజించు నెవ్వఁ
డట్టివాఁడు గుణాతీతుఁడనఁగ జెల్లు.

26. తే. వ్యభిచరింపని మనసుతోఁ బరమభక్తి
నెవఁడు సేవించు నన్నెప్పు డిరద్రతనయ!
వాఁడు త్రిగుణంబులం గెల్చి బ్రహ్మభూతుఁ
డగుట కెల్ల సమర్ధత లందఁగలడు.