ఈ పుట ఆమోదించబడ్డది

17. తే. జ్ఞాన మావిర్భవం బొందు సాత్త్వికమున;
రాజసగుణంబు లోభమే ప్రబలఁ జేయు;
దామసం బున్నచోఁ బ్రమాదంబు మఱియు
భ్రాంతియును జ్ఞానశూన్యంబుఁ బ్రభవ మొందు.

18. తే. జన్మజన్మంబు బంధమోక్షం బొనర్ప
నుత్తమపదంబు సాత్త్వికులొందుచుంద్రు;
కలుగు సంసారమే రాజసులకు; నీచు
లైనతామసజనులకౌ నధమగతియె.

19. ఆ. కర్త వేఱొకండు గాఁడు గుణంబులే
కర్త లంచు నెపుడు గనునొ ద్రష్ట
తద్గుణములు వేఱు తానువేఱని యప్డు
వాఁ డెఱింగి నాదుభావ మొందు.

20. తే. దేహమం దుద్భవించెడు త్రిగుణములను
దేహి గనుఁగొని వాని నతిక్రమించి
జన్మమృత్యు జరాదుఃఖ జాల మెల్ల
విడిచి శుద్ధాత్మరూపంబుఁ బడయుచుండు.

అర్జునుడిట్లనియె :-

21. ఆ. దేవదేవ! యిట్టి త్రి గుణంబులను మించు
నరున కెట్టి లక్షణములు వలయు?
నతని కుండవలయునాచార మెది? యెట్లు
త్రిగుణముల నతం డత్రికమించు?