ఈ పుట ఆమోదించబడ్డది

11. తే.కడఁగి నాయం దనన్యయోగం బొనర్చి
వ్యభిచరింపనిమనసుచే భక్తి సలిపి
జనవిహీనస్థలంబులందు నివసించి
జనసమూహంబులందు నాసక్తి లేక

12. తే. ఆత్మవిషయికజ్ఞానమందాస్థ గలిగి
నిశ్చయజ్ఞానసిద్ధికై నిరతితోడ
అవని వర్తించుటే జ్ఞాన మండ్రు బుధులు;
అట్లు గానిది యజ్ఞాన మగును బార్థ.

13. తే. జ్ఞేయ మనునది విశదంబు సేసెద విను
అమృతసిద్ధికి నటు సేయుటవసరంబు;
మత్పరంబు, ననాది, బ్రహ్మంబు, దాని
పేరు సత్తు నస త్తని పిలువరాదు.

14. తే. అంతటను బాణిపాదంబు లాస్యములును
శ్రోత్రములు శిరస్సులును నక్షులుఁ జెలంగ
జగతి సర్వత్ర తానయై సర్వగతుల
వ్యాప్తి నొందుచు శుద్ధాత్మ వఱలుచుండు.

15. తే. ఆత్మ సర్వేంద్రియగుణంబు లరయఁగలిగి
యింద్రియంబుల నెల్ల వర్జించుచుండు;
సర్వభర్తృత్వము వహించు, సక్తిమాని,
భోక్తగాఁ గల్గి, గుణములు పొందు విడుచు.

16. తే. పంచభూతంబులకు వెలుపలను లోను
గదలుచుండును మఱి తానె కదలకుండు
సూక్ష్మమగుట దుస్తరము చూచుటకు దాని
జ్ఞానులకు దాపు, దవ్వు నజ్ఞానులకును.