ఈ పుట ఆమోదించబడ్డది

17.ఆ. సంతసంబు గనక, వంతలఁ జెందక,
ద్వేష మందక, యభిలాషి గాక,
పుణ్యపాపములను బొందక వర్జించు
భక్తుఁ డగును నాకుఁ బరమప్రియుఁడు.

18. ఆ. సమతఁ జూచుబుద్ధి శత్రుమిత్రులయందు
మానమందును నవమానమందుఁ
జలిని నుష్ణమునను సౌఖ్యదుఃఖంబుల
సంగమును ద్యజింపఁజాలువాఁడు.

19. తే. స్తుతియు నిందయు సమముగాఁ జూచి, మౌని
యగుచు లభ్యంబులకుఁ దృప్తుఁడగుచు, గృహము
లాదిగాఁ గల్గువానియందాశలేని
స్థిరమనస్కుండు నా కగు వరప్రియుండు.

20. తే. ఎవరు ధర్మ్యామృతం బగు నిట్టియోగ
మున నుపాసనఁ జేతురు ననుఁ గిరీటి!
శ్రద్ధతోడ మత్పరమైన బుద్ధి తోడ,
వారె నాభక్తవరులును వరప్రియులును.


బ్రహ్మవిద్యాశాస్త్రమైన భగవద్గీతలోని

పన్నెండవ అధ్యాయము భక్తియోగము సమాప్తము.