ఈ పుట ఆమోదించబడ్డది

53.ఆ. తప మొనర్చి యైన దానంబుచే నైనఁ
గ్రతువువలన నైన శ్రుతులనైన
నిపుడు నీవు గనిన యీ విశ్వరూపంబు
దొరకు టన్న మిగుల దుర్లభంబు.

54. ఆ. వేఱుచింత లేని విధమున సర్వదా
నన్ను భక్తిఁ దలఁచు నరుల కెల్ల
సులభసాధ్య మగుదుఁ జూచుటకును బొందు
టకును దెలియుటకును సకలగతుల.

55. ఆ. కర్మలెల్ల నాకె ఘటియించి, మత్పర
త్వమున నిల్చి నాకు భక్తి సలిపి
సంగవర్జితుఁడును సర్వభూతసముండు
నైనపురుషవర్యుఁడందు నన్ను.


బ్రహ్మవిద్యాశాస్త్రమైన భగవద్గీతలోని

పదుకొండవ అధ్యాయము విశ్వరూపసందర్శన యోగము సమాప్తము.