ఈ పుట ఆమోదించబడ్డది

18.ఆ. గతియుఁ బ్రభువు సాక్షి పతి సుహృజ్జనుఁడు ని
వాసశరణములును బ్రభవలయము
లైనస్థానములు నిధానంబు బీజంబు
నవ్యయంబు సకల మగుదు నేన.

19. తే. నేన తపియింపఁ జేయుదు, నేన వర్ష
జలములను స్వీకరించి, మరల విడుతును;
మృత్యువును నేన, మఱియు నమృతము నేన;
సత్తుగా నుందు నేన, యసత్తు నేన.

20. తే. యాజ్ఞికులు సోమపానులు నఘవిముక్తు
లగుచు నాదయచే స్వర్గ మందఁగలిగి
యతులపుణ్యజన్యములు దివ్యములు నైన
భోగముల దివ్యసుఖములఁ బొందుచుంద్రు.

21. ఆ. అచట స్వర్గసుఖములనుభవించినయంత
మర్త్యలోకమునకు మరలుచుంద్రు;
అట్లు కామపరుల కగుఁ, ద్రయీధర్మంబు
లం దశాశ్వతంబు లగుసుఖములు.

22. ఆ. అన్యచింతలేక యనవరతము నన్ను
పాసనంబు సేసి భక్తి సలుపు
నట్టి నిత్యయుక్తులగువారికి క్షేమంబు
యోగమును వహించుచుందు నేన.

23. ఆ. అట్లు గాక యెవ్వఁ డన్యదేవతల నా
రాధనం బొనర్చు శ్రద్ధ గలిగి,
యతఁడుగూడ నన్నెయారాధనము సేయు
వాఁడు సుమ్మి యవిధి పథముఁజొచ్చి.