ఈ పుట ఆమోదించబడ్డది

ఓమ్‌

శ్రీకృష్ణపరబ్రహ్మణేనమః

శ్రీ మద్భగవద్గీత

నవమాధ్యాయము.

రాజవిద్యా రాజగుహ్య యోగము


శ్రీ భగవంతుడిట్లనియె :-

01. ఆ. దీని నతిరహస్యమైనజ్ఞానమును వి
జ్ఞానసహితముగ విశద మొనర్తు;
అట్టి దెఱుఁగ నెల్ల యశుభంబులును నిన్నుఁ
బాయు; వినుము నీ వసూయ లేక.

02. తే. అతులవిద్యలయందు గుహ్యములయందు
రాజమైయుత్తమముఁ బవిత్రంబు నగుచు
నవనిఁబ్రత్యక్షవిషయికమైనధర్మ్య
మవ్యయం బనుష్ఠానసౌఖ్యప్రదంబు.

03. ఆ. ఇట్టిధర్మమం దొకిం తైన శ్రద్ధవ
హింపనట్టిపురుషు లెల్లయపుడు
నన్నుఁజెందలేక నడతురు సంసార
దుఃఖమయము లైన త్రోవలందు.

04. తే. ఇంద్రియాగోచరుఁడ నౌచు నీజగంబు
నెల్ల వ్యాపించియుందు నేనింద్రతనయ!
అఖిలభూతంబులకు నేనె యాశ్రయంబు;
వానిమీఁదఁ నే నాధారపడుటలేదు.

05. తే. అట్లనుట, వాని వహియింతునని తలఁపకు;
ఈశ్వరుఁడ నగునాయోగమీవు గనుము;
వాని భరియింతు; వానితోడ్పాటు గనను;
కలుగు సర్వంబు నాదుసంకల్పముననె.