ఈ పుట ఆమోదించబడ్డది

23. తే. యోగు లెప్పుడు మరణంబు నొందునెడల
మరల జన్మంబు లందరో మఱియు నెట్టి
తఱిని మరణించుచో వారు మరల ధరణి
యందు జనియింతురో విను మది వచింతు.

24. ఆ. అగ్నితేజమందు నహమందు శుక్ల ప
క్షమున ను త్తరాయణమున బ్రహ్మ
విదుల కెల్ల మరణమొదవిన, వారికి
బ్రహ్మపదముఁ బొందు భాగ్య మబ్బు.

25. తే. ధూమమందును రాత్రియందునను గృష్ణ
పక్షమందును మఱియును దక్షిణాయ
నమున మరణింపఁ జంద్రతేజమును బొంది
యోగిజనుఁడు చెందును బునరుద్భవంబు.

26. ఆ. కలవు పార్థ ! రెండు గతులుగా శుక్లకృ
ష్ణంబు లనుచు యోగిజనుల కెల్ల;
అందు నొకట యోగి చెందు ననావృత్తి
మఱియొకంటఁ జనిన మరలఁ బుట్టు

27. ఆ. ఇట్టి రెండు తెఱఁగు లెఱిఁగినయోగిపుం
గవున కెపుడు భ్రాంతి గలుగఁబోదు;
కనుక నీవు సర్వకాలంబులను బార్థ !
యోగయుక్తుఁడవుగ నుండవలయు.