పుట:Geetha parichayam Total Book.pdf/62

ఈ పుట ఆమోదించబడ్డది

చెప్పిన ద్వైత, అద్వైత సిద్ధాంతములు రెండును హేతుబద్దముగ లేవు. ద్వైత సిద్ధాంతమును పరిశీలించి చూచినట్లయితే భూమి మీద వేర్లు లేకుండ చెట్టున్నదనుట ఎంత సత్యమో అంతే సత్యముగనున్నట్లు తెలియుచున్నది. అట్లే అద్వైత సిద్ధాంతమును పరిశీలించితే భూమి, వేర్లు రెండు లేకుండానే చెట్టున్నదనుట ఎంత సత్యమో అంతే సత్యమగును. అనగ రెండు సిద్ధాంతములు అశాస్త్రీయముగనున్నవని, హేతుబద్దముగలేవని తెలియుచున్నది. ఈ రెండు సిద్ధాంతములు అశాస్త్రీయము, అహేతుకమనుటకు గీతలోని పురుషోత్తమప్రాప్తి యోగమందు గల 16,17వ శ్లోకములే ఆధారము. ఈ రెండు శ్లోకములు ద్వైత అద్వైత సిద్ధాంతముల రెండిటిని ఒక్క వేటుతో కొట్టిపారవేయుచున్నవి. ఈ రెండు శ్లోకములే అసలైన ఆధ్యాత్మిక సిద్ధాంతమైన త్రైత సిద్ధాంతమును బోధిస్తున్నవి. ఈ రెండు శ్లోకములే కాక గీత యొక్క సారాంశమంతయు త్రైతము మీదనే బోధింపబడియున్నది. కలియుగములో ద్వైత, అద్వైత సిద్దాంతములు బయటికి రాగ, ద్వాపరయుగ అంత్యములోనే త్రైత సిద్ధాంతము భగవంతుని చేత బోధింపబడి ఉన్నది. అయినప్పటికి మాయా ప్రభావము చేత త్రైతము అర్థము కాకపోయినది. మాయా ప్రభావము చేతనే ద్వైత, అద్వైతములు బయల్పడినవి. ఇప్పటికి ద్వైత, అద్వైత గురుపరంపరలైన మద్వాచార్య, శంకరాచార్య పీఠములు భూమి మీద గలవు. త్రైతమను పేరుగాని దానిని బోధించువారుగాని లేకుండపోయారు. ఇట్టి పరిస్థితులలో త్రైతము బయటికి రావడము మన అదృష్టమని తెలియాలి. త్రైతము ప్రకారమే భగవద్గీత, భగవద్గీత ప్రకారమే త్రైతము గలదు. మనము ఇక్కడ క్రొత్తగ చెప్పుకొనుచున్న త్రైత సిద్ధాంతమును గురించి కొద్దిగ వివరించుకొందాము.

పరమాత్మ తప్ప రెండవది లేదనుట అద్వైతము, పరమాత్మ జీవాత్మ రెండు కలవనుట ద్వైతము. పరమాత్మ జీవాత్మకు మధ్యలో ఆత్మగలదని మూడింటిని గూర్చి తెల్పునది త్రైతము. ఏ విధముగ భూమికి చెట్టుకు మధ్యలో కనిపించకుండ వేర్లున్నవో, అట్లే పరమాత్మకు జీవాత్మకు మధ్యలో ఆత్మగలదు.