పుట:Geetha parichayam Total Book.pdf/40

ఈ పుట ఆమోదించబడ్డది

అవసరము. మాకేమి బాధ లేదు కావున మాకు అవసరము లేదు" అనుచున్నారు. ఇక్కడ ముఖ్యముగ చదివేవానికి తన నిమిత్తమే దీనిలోని విషయములు గలవను తలంపురావడము లేదు. అందువలన నేడు భగవద్గీత పారాయణము చేయుటకే ఉన్నదని, కంఠాపాఠము చేసుకొని పారాయణము చేయుచున్నారు. కాని దాని అర్థము గూర్చి ఎవరు యోచించడము లేదు.

బాగా పారాయణము చేయు ఒకరి వద్దకు పోయి మీరు శ్లోకములు బహుచక్కగ పారాయణము చేయుచున్నారు. అందులోని అర్థము కూడ మీకు బాగా తెలిసివుండునని అడుగగా! అందులకాయన "అర్థముతో మాకు పనిలేదు, పారాయణము చేయడము మంచిదని చేయుచున్నాము" అన్నాడు. ఆ శ్లోకములు ఎందునిమిత్తము చెప్పబడినవో తెలియకుండ కేవలము పారాయణము చేయడము ఏమి మంచిదని మేము అడుగగా! ఆయన (శ్రీకృష్ణుడు) ఏమి చెప్పితే మనకేమి? ఏమి చెప్పాడని చూచుకోవలసింది అర్జునుడు, మనము కాదు. మనము పెద్దలు చెప్పినట్లు పారాయణము చేయడము మంచిది, కాని ఇదెందుకు, అదెందుకని అడగకూడదు అని గద్దించి చెప్పాడు. ఇలా చాలామంది గీతలోని మొదటి అధ్యాయమైన అర్జున విషాదయోగముతో గీత యొక్క భావమునకు దూరమైపోవుచున్నారని తెలియుచున్నది. కావున మేమిపుడు వ్రాయు భగవద్గీతలో అర్జునవిషాదయోగము అను అధ్యాయము లేకుండ కేవలము భగవంతుడు చెప్పిన మాటలనుండియే మొదలు పెట్టి భగవద్గీతయను పేరుకు అర్థము సార్థకమగునట్లు వ్రాయదలిచాము.

కొందరు తెలివైనవారు గీతాపారాయణము మీద దృష్ఠి పెట్టక, అందులో శ్రీకృష్ణుడు ఏమి చెప్పాడని చూచేవారు కూడ గలరు. అటువంటి వారు, అందులో సత్యము తెలుసుకోవాలనుకొన్నవారు, గీతను పూర్తిగ చదివినప్పటికి అందులో నుండి ఏమి తెలుసుకోలేక చివరకు ఎన్నో సంశయములనుకల్గి, ఇది మనకేమి అర్థము కావడము లేదు. ఇందులోని విషయములు