పుట:Ganapeswaralayam - K. Srinivasa Rao.pdf/33

ఈ పుట ఆమోదించబడ్డది

బహుశా ఊరిబయట వున్న దేవాలయం కావడంతో రక్షణ తక్కువని కొత్తవిగ్రహాన్ని ఆలయం లోపటే హుండీకి వెనుకగా అమర్చారు. బయటి నందిపై అలంకరణలు రమ్యమైనశైలిలో చెక్కబడివున్నాయి. మెడలో గంటలు, అలంకరణ దండలు, కాలి పట్టెడలు వంటివి వున్నాయి. వాటి నిర్మాణంలో శిల్పి నైపుణ్యం కనిపిస్తుంది. అంతే కాకుండా నంది వీపుపై ఒక తాడు ముడి వుంది. దానిని సాధారణంగా ఏనుగుముడి అంటారు. ఆంగ్లంలో రీఫ్ నాట్. ఇది చాలా గట్టిముడి. వ్యవసాయ పనుల్లోనూ, సైనిక శిబిరాల ఏర్పాటులోనూ ఈ ముడి ఉపయోగం చాలా ఎక్కువ. ముడిని ఎలా వేయాలో అర్ధం అయ్యేంత విపులంగా చెక్కారంటే శిల్పాల నిర్మాణంలో అలంకరణకే కాక ఉపయోగానికీ ప్రాధాన్యత నిచ్చారని తెలుస్తోంది. ముఖ్యమైన విషయాలు వారితోనే అంతరించిపోకుండా తర్వాతి తరాలకు అందేందుకు వీటిని సాధకాలుగా వాడుకున్నారు.

ఉపాలయ స్తంభాలు

దేవాలయ స్తంభాలు కేవలం పైకప్పును మోసేందుకు మాత్రమే కాదు, అలంకరణకోసం కూడా వాడారు. గణపేశ్వరాలయంలో ప్రధాన ఆలయానికి కానీ రంగమంటపానికి కానీ ఎటువంటి స్తంభాలనూ వాడలేదు. కానీ పక్కనే వున్న ముక్కంటేశ్వరాలయానికీ, వేణుగోపాలస్వామి ఆలయానికీ కాకతీయ నిర్మాణ శైలిని ప్రతిబింబించే స్తంబాలను నిర్మించారు. స్తంభాన్ని వివిధ ఆకృతుల సమ్మేళనంగా చెక్కడమే కాక, దానిపై రాజహంసలను మరికొన్ని అందమైన ప్రతిమలను మలచారు. స్తంభం చివర దూలాలను పట్టుతో మోసేందు అనుగుణంగా + (ప్లస్) ఆకారంలో ఆధారాలను ఏర్పాటు చేయటం ఇక్కడి స్థంభాలలో ప్రత్యేకత. అటువంటి స్తంభాలనే ప్రధానాలయం ముందు కూడా గమనించవచ్చు. దేవాలయ స్తంభాలను వాటి ముఖాల ఆధారంగా వేర్వేరు పేర్లతో పిలుస్తారు. నాలుగు ముఖాలుండే స్తంభాలను రుచక అని ఎనిమిది ముఖాలుంటే ‘వజ్ర’ అని పదహారు ముఖాలుంటే ద్విగుణ వజ్ర అని ముప్పైరెండు ముఖాలుంటే ‘ప్రతినక’మని అంటారు. ఇక్కడి స్తంభాలలో ఒకే స్తంభంలో వివిధ ఆకారాల మేళవింపును క్రమమైన పద్దతిలో నిర్మించుకుంటూ వెళ్ళారు. మంటపంలో వున్న కొన్ని స్తంభాలపై ప్రత్యేకమైన శైలిని కూడా ప్రదర్శించారు. అలాకాకుండా స్థూపాకారంలోని స్తంభాలు గుండ్రంగా వృత్తాలవలే వుంటే వాటిలోని సూక్ష్మవ్యత్యాసాల ఆధారంగా బ్రహ్మకాంత, విష్ణుకాంత, సౌమ్యకాంత, మరియు రుద్రకాంత అనే పేర్లతో పిలుస్తారు.