పుట:Ganapeswaralayam - K. Srinivasa Rao.pdf/22

ఈ పుట ఆమోదించబడ్డది

గణపేశ్వరాలయం అమరిక

దేవాలయాల గురించి తెలుసుకునేందుకు చాలా చోట్ల శాసనాలు, సాహిత్యం ఉపయోగపడ్డాయి. అదేవిధంగా దేవాలయ నిర్మాణాన్ని ఒక క్రమంలో అర్ధం చేసుకోవడం ద్వారా కూడా ఆలయం గురించి చాలా విషయాలు తెలుసుకోవచ్చు. అదృష్టవశాత్తూ గణపేశ్వరాలయం పునాదులనుంచి మూలవిరాట్లువరకూ చెక్కుచెదరకుండా నిలచివున్నాయి. వాటిని ఒక్కొక్కటిగా పరిశీలిస్తూ నిర్మాణసంగతులను అర్ధం చేసుకోవచ్చు.

పీఠం, ఉపపీఠం

దేవాలయం మొత్తం దేనిమీద నిలబడి వుంటుందో దాన్ని ‘పీఠం లేదా అధిష్ఠానం’ అంటారు. ఇది దేవాలయానికి ‘పాదం’ లాంటిది. కాకతీయుల కాలంలో కట్టించిన పెద్దపెద్ద దేవాలయాలన్నింటిని భూమికి 5 లేదా 6 అడుగుల ఎత్తుగా వున్న అత్యంత విశాలమైన రాతి పీఠాలపై నిర్మించారు. పాలంపేట రామప్పదేవాలయం, హనుమకొండ రుద్రేశ్వరాలయం, పిల్లలమర్రి ఎరుకేశ్వరాలయం లాగానే కూసుమంచి గణపేశ్వరాలయాన్ని కూడా నేలనుంచి 6 అడుగులు పై బడిన ఎత్తులో పీఠాన్ని తయారుచేసి దానిపై ఆలయాన్ని నిర్మించారు. పునాదులకోసం డబ్బాలాగా దీర్ఘఘనాకారంలో తీసిన కందకంలో ఇసుకను నింపి, కుదించి, దానిపై బండలను ఒకదానిపై ఒకటి ఒక క్రమంలో పేర్చారు. ఈ రకంగా ఇసుక పునాదులు వాడటాన్ని శాండ్ బాక్స్ టెక్నాలజీ అంటున్నాము. భూమి పొరల్లో సర్ధుబాట్ల వాళ్ళ భూకంపాలూ, తుఫానులూ వంటివి వచ్చినప్పటికీ మొత్తంగా పీఠం పగుళ్లిచ్చి కూలిపోకుండా ఇసుకలో సర్ధుబాట్లు జరగటం ద్వారా ఆలయం నిలబడే వుండేందుకు ఈ విధానం తోడ్పడుతుంది అని కొందరు నిపుణులు అంటున్నారు. రైలుపట్టాల విషయంలోనూ, హైవే విద్యుత్ తీగలు వదులుగా కట్టడంలోనూ ఉష్ణవ్యాకోచాలను దృష్టిలో వుంచుకున్నట్లు కాలక్రమంలో సంభవించే ఉష్ణోగ్రతా