ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

97

పరిణామశూల గలఁవాడగుటచే శూలియయ్యెను. ఆ గంగాధరుఁడు శిరమున నర్ధచంద్రరేఖ ధరించెను. ఈ గంగాధరునకుఁగూడ శిరస్సునగాక పోయినమానె మెడమీదనర్థచంద్రప్రయోగములు చాలసారులు జరిగెను. గంగాధరుఁడనేక లక్షణములలో శివునకు సమానుఁ డగుటయేగాక నొక విషయమున నారాయణుఁ డంతవాడని చెప్పవచ్చును. క్షీరసాగరమందు శేషశాయియై నిరంతరమువసించుటచేత నారాయణుఁడను పేరు గలిగెను. నారమనఁగా జలము. ఆయనమనఁగా స్థానము. నారాయణుఁ డనగా జలమె స్థానముగా గలవాడు. గంగాధరుఁడుగూడ తరుచుగా జలగ్రహణార్థము చెరువులలో నుండుటచే నారాయణుఁ డని చెప్పుట తప్పుగాదు. ఒక్క నారాయణుని తోడనెగాదు, గంగాధరు ననేక దేవతలతోఁ బోల్చవచ్చును. గంగాధరుఁడు పాకశాసనుఁడు. పాఁకుడను రాక్షసుని శాసించుటచేత నీ పాకశాసన శబ్దము లోకమున దేవేంద్రుని యందు వర్తించుచున్నది. పాకమనఁగా వంటను శాసించుటచేట గంగాధరుని యందుఁగూడ నీశబ్దము సార్థకమని చెప్పవచ్చును. గంగాధరుఁడు వంట చేయునని యదివఱ కెక్కడను జెప్పియుండకపోవుటచే నితని యందాశబ్ద మెట్లు సార్థక మగునని మీ రనుమానింపలదు. ఒకఁడు తర్కవ్యాకరణములను రెండు శాస్త్రముల యందు నిర్దుష్ట పాండిత్యముగలిగి యుండియు నేదో యకటే యభిమానవిద్యగ స్వీకరించి యం దెక్కువ కృషిచేసి