ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

93

మక్షయపాత్ర మునుపటివలె నిండుటలేదు. ఈకారణము చేత గంగాధరుఁ డేనుగుల మహలునుండి రంగస్థలము మార్పఁదలఁచెను. దీర్ఘాలోచనమీఁద గోదావరీ మండలమునకుఁ బ్రధాన నగరమైన కాకినాడ తన ప్రజ్ఞాప్రదర్శనమున కుత్తమరంగమని తోచెను. తోచుటయ తడవుగ నది తల్లితోఁ జెప్పి మరునాడు పయనమైపోయెను. పోయి యక్కడ మొదట రెండుదినములు సత్రములో దాను భోజనముజేసి తల్లి నత్తిసరుపెట్టుకొమ్మని చెప్పి పట్టణమంతయుఁ దిరిగి స్థితిగతులు పరిశీలించి కాకినాడలో నాకాలమున జనులు నీరు దొరకక విశేషమిబ్బంది పడుచుండుటచే వారిబ్బంది తీర్చుటకై తన జన్మము వినియోగింపఁ దలచెను. అతని నిర్ధారణము తల్లికూడ నంగీకరించినందున మరునాడె కావడిబద్దయు రెండుమట్లు గొని తెచ్చి మొదట నొకరిద్దరి వాడుకలు సంపాదించి నీళ్ళుమోయ నారంభించెను. అతని చాకచక్యము కార్యశూరత మొదలైనవి చూచి పట్టణ మందనేకులు వానిని నీళ్ళు పోయమని కోరిరి. దినమునకు ముప్పదికావిళ్ళైనను గంగాధరుఁడు మోసెననుట యతిశయోక్తిగాదు. కాకులు కూసినవేళ లేచి సూర్యాస్తమయ మగువఱకు నించుమించుగ నతడు కావిడి దింప డనుట నిశ్చయము. కొంతపైకము చేత జిక్కువఱకు నతఁడు సత్రము లోనే కాపురముండి పిమ్మట నొకచిన్న యిల్లద్దెకు పుచ్చుకొనెను. గంగాధరుని పేరు పట్టణమంతయు వ్యాపించెను. కలక్టరు కచేరీలోని గుమాస్తాలు మొదలగు