ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

87

నని యుపనయనముఁ దలపెట్టెను. ఉపనయనము జూచుటకు గాకపోయినను పీటలమీఁద గూర్చుండి జందెము వేయుట కైన నెవరు లేరు గావున నందులకైన నొక్కసారి రావలసినదని పిచ్చమ్మ తండ్రికి వర్తమాన మంపెను. కాని యన్నప్పకు వేదాంతము ముదురుటచే పిల్లవానికిఁ దండ్రిలేని కారణమున జందెమెవడు వేసినది కూలికేయని తలంచి మఱియొకరిచేత నది చేయించ వలసినదనియు దనకుఁ దీరికలేదనియు వర్తమాన మంపెను. పాపము పిచ్చమ్మ యెవ్వరినో బ్రతిమాలి జందెము వేయించి యుపనయనము మైనదనిపించెను. ఏ మంచిమూహూర్తమందు భిక్షాందేహి యనుమాట గంగాధరుని నోట వచ్చెనో కాని జన్మాంతమువఱకు నించుమించుగ నతఁడు దానిని వదలి పెట్టక యేదో విధముగ స్మరించుచు వచ్చెను. అదియె యతనికి తారక మంత్రమయ్యెను. ఉపనయనమైన యొకమాసమున కతఁడు ముందుగా యాయవారమారంభించెను. ఆ గ్రామములో సరిగా వారి సంసారమునకుఁ గావలసిన బియ్యము దొరుకుట దుర్లభమైనందున మధ్యాహ్నము మాధుకరము జేయుచుండెను. శ్రాద్ధభోక్తగా వెళ్ళిన నాఁడు మాత్రము మాధుకరము మానుచుందును. భగవంతుఁడు నిర్హేతుక జాయామాన కటాక్షముచేతఁ గొందఱకు బాల్యమునందె యీఁడునకుఁ దగినప్రజ్ఞ లిచ్చుచుండును. ఈశ్వరానుగ్రహముచేత భగవానుఁడగు శంకరాచార్యుడేడవ యేటనె సాంగవేదాధ్యయన సంపన్నుఁ డయ్యెనట. ఒకఁ