ఈ పుట అచ్చుదిద్దబడ్డది

72

గ ణ ప తి

కంచములో బెట్టువారు లేరు; నారాయణ నారాయణా యీ పిల్లమాటే తలఁచుకొని నేను బెంగపెట్టుకొన్నాను. ఇన్నిమాటలెందుకు? నేను పునస్సంధానముజేయఁ దలంచుకొనలేదు.” అనవుడు సీతారామయ్య శాంతివచనముల నతని బతిమాలి కట్టకడపట నిట్లనియె “మహర్షులవంటి మహానుభావులు సయితము మనుష్యులు చేసిన పాపముల పరిహారము నిమిత్తము ప్రాయశ్చిత్తము విధించిరి. ప్రాయశ్చిత్తము లేనిదోషము లేదు. పొరబాటు లెవరివల్ల వచ్చినను, వచ్చినవె. అందుచేత పాపయ్యకుఁ గూడ నేదో ప్రాయశ్చిత్తము విధించండి. అనగా మీకాళ్ళు పట్టుకొని మిమ్ములను బతిమాలు మని చెప్పండి. ఏదోవిధముగ మనలో మనము సర్దుకొని పిల్లకాపురము పొత్తుచేయవలెను. కాని చెడగొట్టుట మంచిదికాదు.” అని పలుక నన్నప్ప తల పైకెత్తి కొంచమాలోచించి “సరే; పెద్దలు చెప్పినారు గనుక మీ మాటప్రకారము నేను నడచుకోదలచుకొన్నాను. ఏదోప్రాయశ్చిత్తము విధించుమన్నారు; గనుక మూఁడువందల రూపాయలు మూటగట్టి నాచేతికిచ్చిన పక్షమున మును పైన దేమిటో యైనదని వెనుకటిదంతయు మఱచి కార్యము చేసెదను. లేదా నాపిల్ల విధవాడ పడుచువలె నాయింటనెయుండును. ఈమాటలె పాపయ్యకు జెప్పండి; మూటలెగాని యిఁక మారుమాట లక్కఱలేదు. ఇన్నిమాటలులేవు నాతో” నని కంఠోక్తిగఁ బలికెను.

ఆ సందేశమును సీతారామయ్య యధోక్తముగఁ బాపయ్య కెఱిగించెను. మూఁడువందలరూపాయ లిచ్చుట