ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

71

రాధమును మరువఁదలఁచినను మామగారికి మరపు రాకుండుటచేత నతఁడు తన్నింటికి రానిచ్చునా, తనకు బట్టెడన్నము బెట్టునా, సొమ్ము కర్చుపెట్టియతఁడు పునస్సంధానముజేయునా యని సందేహము దోఁచెను. అందుచేత నతఁడుస్వయముగా వెళ్ళుటకంటె రాయబార మంపుట మంచిదని చెరువు సీతారామయ్య యను బంధువును మామకడ కంపెను. అతఁడు మూలస్థానము వెళ్ళి యన్నప్పగారిని గలిసికొని కూఁతురు రజస్వలయైనమాట సత్యమని యతనినోటనె విని పునస్సంధానము మాట తలపెట్టెను. అల్లునిమాటఁ దలపెట్టగానె యన్నప్ప నిప్పులుత్రొక్కిన కోఁతివలె చిందులు త్రొక్కి బిగ్గరగ నఱచుచు నిట్లనియె. “పాపయ్య కిప్పుడేను మామగారి నైనాను గాఁబోలు, నాకిప్పుడాయన యల్లుడైనాఁడు గాఁబోలు, చీఁకటిలో జాము రాత్రివేళ నన్ను తనయింటనుండి యాలుబిడ్డలతోగూఁడ లేవగొట్టినమాట తాను మఱచినను నేను మరువలేదు. నాడొక్కలో శూలించుచున్నది. అది జన్మజన్మములకైనను నాకు మఱపురాదు. నేను మధ్య వాళ్ళమాట నమ్మి నిష్కారణముగా నాపిల్లగొంతుక కోసినాను. అటువంటి మగనితో నాపిల్ల కాపురము చేయుట కంటె నాకు రెండవ మగపిల్లవాఁడు లాగున నాబంతి నింత యన్నము దిని యిచ్చటనె యుండగలదు. అత్తలేదు. ఆఁడబిడ్డలేదు, ఏకాకి ముండాకొడుకు వాఁడు. కాలు నొచ్చును, చేయి నొచ్చును, పిలిచినా పలుకువారులేరు; పట్టెడన్నము