ఈ పుట అచ్చుదిద్దబడ్డది

56

గ ణ ప తి

యెమ్మెకత్తెలు సాలిజవరాండ్రు గొల్ల గుబ్బెతలు బాగుపడిరి. ఈ దానములు లేని పక్షమున బాపయ్య బంగారుగోడలుకట్టి యుండును. కాని లక్ష్మి పక్షపాత మనస్కురాలు; అందుచేత మగవాని యండనుండక తనజాతి యాఁడువాండ్ర గడకు బోయెను. అదిగాక పాము కన్న గ్రుడ్లన్నియు బ్రతుకునా? పులికిఁ బుట్టిన పిల్లలన్నియు బ్రతుకునా? నల్లేరు చెట్లన్నియు నెదిగి వృక్షము లగునా? అట్లయినచో జగము లాగునా? ప్రతివాఁడు సంపాదించిన దంతయు నిలువచేసిన పక్షమున జ్యేష్టాదేవికి నిలువనీడయుండునా? పాపయ్య కిప్పటి కేబది సంవత్సరములు వచ్చినవి. పునహాకు వచ్చి యిరువదిసంవత్సరము లైనది. పోయినవి పోగా నతనియొద్ద మూడు వేలరూపాయలు నిలిచినవి. అప్పుడప్పుడొక మారువాడీయెద్ద కొంత సొమ్మతడు నిలువచేసి యుండుటచే నీమాత్రమైన గనబడినది. ఆ సొమ్ముగూడ నెన్నో సారులు తీసికొనుటకితడు ప్రయత్నించి మారువాడిని గట్టిగా నడిగెను. కాని “బ్రాహ్మణుఁడు దిక్కు లేనివాఁడు ఏ పడుపుకత్తె యింటనొ యే శ్మశానములోనో యాకస్మికముగ జచ్చిపోగలడు. అప్పుడీ సొమ్మంతయు మనకే దక్కగలదు. వీని కిప్పు డెందు కిచ్చి చేతఁజిక్కినది పోగొట్టుకొనవలయు” నని యా మారువాడీ తలంచి పాపయ్య వచ్చినపుడెల్ల యేదో వంక జెప్పి పంపివేయు చుండును. ఎట్లైన నేమి, మారువాడీ మనోరథము భగ్నమైనది. మారువాడీ మశూచికమువచ్చి మృతినొందెను. అతని కొడుకు పాపయ్య