ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

359

నా దగ్గర యైఁదువందల రూపాయలు పుచ్చుకొని యంతర్వేదిలో శ్రీనృసింహస్వామివారి యాలయములో ఆ పిల్లను నాకిచ్చి పెండ్లి చేసినాఁడు. వివాహమై యేడాది కాలేదు. ఇప్పుడా పిల్లనే తిరిగి యీ పిల్లవానికి వివాహము చేసినాడు. అంతేకా దీయన ప్రభావము వినండి. ఈ పిల్ల యీయన కూతురుగాదు. ఆవిడ యీయన భార్య కాదు. ఆవిడ సాతానిది. ఆమెది వెంకటేశ్వర్లువారి వాడపల్లె కాపురము. సాతాని తిరువెంగళయ్య భార్య, ఈవిడ పేరు నాంచారమ్మ. ఈ దుర్మార్గు డామెను పుత్రికాసహితముగా లేవదీసుకొని వచ్చి యిది తనభార్య యని, యాపిల్ల తన కూతుఁరని చెప్పి మొదట నన్ను మోసపుచ్చి పిమ్మట మిమ్మును వంచించినాఁడు. అందుచేత నితనిమీఁదను నితని క్రొత్తయల్లుని మీదఁను నేను డెప్యూటీ తహసీలుదారుగారివద్ద క్రొత్తపేటలో ఛార్జీ యిచ్చినాను. క్రొత్తయల్లునికి మామకు వారంటు తెచ్చినాను." వారంటను శబ్దము వినగానే గణపతి దొడ్డిదారిని నెక్కడికో పాఱిపొయెను. నాటికి నేటికి మరల కనఁబడలేదు. భైరవదీక్షితులున కాఱుమాసములు కారాగృహశిక్ష విధింపఁబడెను. తిరువెంగళయ్య తన భార్యను బిడ్డను దీసికొనిపోయెను. శూద్రసంపర్క దోషమునకై వానపల్లి గ్రామవాసులు ప్రాయశ్చిత్తములు చేయించుకొనిరి.