ఈ పుట అచ్చుదిద్దబడ్డది

350

గ ణ ప తి

విద్యార్థులతో బలికెను. గణపతి, తల్లిని పూర్వవిద్యార్థులను యా మహోత్సవసందర్శనార్థ మరుదెంచిన గ్రామీణులను నోటికి వచ్చిన ట్లెల్ల దిట్టి, కాలుచేతులు స్వాధీనము గాకపోవుటచే గొందరం గఱచి, కొందఱం దలతో గ్రుమ్మి, గ్రామము నుండి యుత్సవము జూచుటకై కాలువవరకు నడచివచ్చిన వారి శ్రమ వృథాగాకుండ గావలసినంత వినోదము గలిగించెను. పూర్వవిద్యార్థు లట్లు తన్ను బాధించుచుండ దనకా పీడ దొలఁగింపు మని గణపతి తత్కాలపు విద్యార్థులతో వెన్నుముదిరిన వాండ్రను గొందరను బిలిచిచెప్పెను. కాని వారేమియుఁ చేయలేకపోయిరి. ఈ యభిషేకమైన తరువాత వారు గణపతిని మెల్లగా నిల్లుజేర్చిరి. ఈ పని తల్లియె చేయించిన దని యతఁడు తెలిసికొని, యామె తనకంటికి కనఁబడకూడదని చెప్పెను. అతఁడేదైన దుష్కార్యము చేయునేమో యని యామెను మహాదేవ శాస్త్రులగారి యింటికి పంపిరి. గురువుగారికి శిష్యులే తమ తమ యిండ్లనుండి పూటకొక్కరుగ వంతులు వేసికొని యన్నము దెచ్చి పెట్టుచుండిరి. తల్లి తనకు గావించిన పరాభవము తాను తల్లికి గావింపవలె నని యతనికి దృఢసంకల్పము కలిగెను. కలుగుటయు దన కాప్తులైన పదుగురు విద్యార్థులను బిలిచి యొకనా డిట్లనియె. "ఓరీ! నా కొక్క పెద్దచిక్కు సంభవించినదిరా! మా తల్లి వట్టి పిచ్చిముండై పోయినది. దానిపిచ్చి కుదురుతేనే గాని నాకు సుఖము లేదు.