ఈ పుట అచ్చుదిద్దబడ్డది

330

గ ణ ప తి

ప్రజ్ఞలన్నియు శిష్యులకు లేకపోయినను నిద్రావిషయమున మాత్ర మతని శిష్యులే యని యనిపించుకొనుటచేత నట్టి సందేహమున కవకాశము గలిగెను. పట్టణములో గొప్పవారి యిండ్ల నుండు నట్టి గడియారమొక్కటి యున్నపక్షమున ముందుగాఁ దక్కిన వారికి మెలఁకువ వచ్చుటకు వీలుగా నుండునని యొకడు చెప్పెను. అది విని కాపుల కుఱ్ఱవాఁ డొక డిట్లనియెను. "గడియారములు మన దేశములో లేవు. నూటనాట నొకటి యున్నదో లేదో! అదిగాక గడియారము లేకపోయిన నేమి? మంచి కోడిపెట్ట నొక దానిని మనము పెంచుకొన్నపక్షమున నది నాలుగుజాములకు కూయును. కడపటిసారి కూసినతోడనే ముందుగా మనకు మెలకువ వచ్చును. ఆ తరువాత మనము గురువుగారిమీద నెక్కి త్రొక్కియొ రక్కియొ గిల్లియొ కఱచియొ లేపవచ్చును. ఇదిగాక కోడిని పెంచుటవల్ల గురువుగారికి మఱి రెండు లాభము లుండును. కోడి గ్రుడ్లమ్మినందువలన కొంత డబ్బు చేరును. పైగా దాని కడుపున రెండుమూడు పుంజులు మంచివి పుట్టినయెడల మన యమ్మవారి తీర్థములోను మఱి యితర తీర్థములలోను వాటిచేత పందెములు కట్టించి కావలసినంత డబ్బు సంపాదించవచ్చును. కాబట్టి నా యుపాయము విని యొక కోడిని పెంచుట మంచిది. " అనవుడు వెఱ్ఱివాలకముగా నున్న యొక బ్రాహ్మణబాలుడు "ఛీ! ఛీ! కాలమానము దెలియుటకు బ్రాహ్మణు లెవరైన కోడిని పెంచుదురా? ఇది చాల తప్పు. అది మనము చేయవలసినది కా" దని