ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పందొమ్మిదవ ప్రకరణము

వానపల్లెలో గణపతి స్థానమందుఁ బ్రవేశించిన యుపాధ్యాయుఁడు కాలవశమున విశూచి జాడ్యముచేత మృతినొందెను. అందుచేత నా యూరులో బడి చెప్పువారు లేకపోయిరి. అంతలో గణపతి కృష్ణవేషధారణమును, పాచకత్వము నను రెండుద్యోగములు మానిఁ యా గ్రామము బోవ తటస్థించెను. గణపతిచర్య లెన్నటికి మరపురానివైనను కొంద రా చర్యలు మరచి బడి పెట్టు మని యతని నడగరి. కొందరు గణపతి యెంతమాత్ర మా పనికి బనికిరాఁడని వాదించిరి. అభిమాన మున్నవారి యాదరముచేత నతఁడు మునుపటి చోట గాక మరియొక చోట పాఠశాల స్థాపించెను. బసయు మునుపటి చోట చేయక యా యూరివా రొకరు స్వగృహము విడిచి బిడ్డల కింగ్లీషు చెప్పించుకొనుటకు అమలాపురము వెళ్ళుచుండఁగా వారి నడిగి యా యిల్లు తన కాపురము నిమిత్తము గణపతి పుచ్చుకొని యందుఁ బ్రవేశించెను. ఇల్లు పెద్దదగుటచే పిశాచములు వచ్చి పీడించునని యాతడు విద్యార్థుల నెప్పటి యట్లు కొందరిని దనకు సాయముగ బిలుచుచుండును. ఆ యింటి దొడ్డిలో నాలుగైదు కొబ్బరిచెట్లుండెను. ఎలుక లప్పుడప్పుడు చెట్లెక్కి లేక పుచ్చెలు కొట్టి క్రింద పారవేయజొచ్చెను. ఎలుకలు రాయిడి తొలగించుటకై గణపతి యనేక యుపాయములు బన్నెను. ఆ యుపాయములలో నొకటియు నతనికి