ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

309

లేక పడియున్నాడండి' యని శాస్త్రితోఁ జెప్పిరి. బ్రతికి యున్నాడో లేదో నాడి చూచి, ముక్కదగ్గర వ్రేళ్లుపెట్టి చూడండి యని ప్రత్యుత్తర మిచ్చి చేతినొప్పితో మెల్లగా నచ్చటి కరిగెను. వారట్లు చూచి "బ్రతికి యున్నాఁడు. తలకు మోపైనదెబ్బ తగిలియుండఁబట్టి తల దిమ్మెత్తి పడియుండఁబోలు" నని చెప్పి చేతితో నిట్టటు గదలించి చెవిదగ్గఱ గణపతీ! గణపతీ ! యని గట్టిగా నఱచిరి. అప్పు డతఁడు ఆ! యని పలికెను. మరియు నట్టివిధముగానె నిద్దఱు రెండుచెవులదగ్గర జేరి కంఠము లెత్తి పిలువ నతడు మేల్కొని 'బండి యాపినారేమి? యని యడిగెను. అపుడు జరిగిన వృత్తాంత మంతయు శాస్త్రి వానితోఁ జెప్పెను. క్రొత్త బాటసారులు గణపతి యొక్క యఖండనిద్రను దెలిసికొని 'కలియుగ కుంభకర్ణుడురా, యీ గణపతి!' యని మహాశ్చర్యమనస్కులై తమ దారిం జనిరి. మన కథానాయకుని నిద్రాతిశయమును గూర్చి వ్రాయఁదలచుకొన్న పక్షమున నింకను ననేకోదాహరణము లున్నవి. గాని గ్రంథ విస్తరభీతిచేత నింతటితో విరమింపవలసి వచ్చెను.

పదునెనిమిదవ ప్రకరణము

గణపతియొక్క బ్రతుకంతయు నల్లరి బ్రతు కగుటచేతను నతని తెలివితేటలు బాలకుల తలిదండ్రులకే గాక బాల