ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

301

గ్రామవాసులు చేరి కంఠము లెత్తి మాటలాడుచున్నను గణపతికి మెలకువ రాలేదు. అంతలో సూర్యోదయ మయ్యెను. గణపతి మొగముమీద సూర్యకిరణముల వెలుగు పడెను. అప్పుడు గణపతికి నించుక మెలకువరాఁగా నతఁడు "ఉండవే లేస్తాను. ఏమి తొందర వచ్చినది?" అని కన్నులు తెరవకయే చేతితోఁ దల్లిని గెంటెను. అప్పుడందరు 'పంతులుగారు బ్రతికి యున్నారు, బ్రతికి యున్నారు, చావలే' దని కేకలువేసి చప్పటలు కొట్టిరి. సింగమ్మ "నా తండ్రీ! బ్రతికున్నావురా, నాయనా ! ఈ గండము గడిచినది గనుక నిన్ను దీసికొని తిరుపతి వెళ్ళెదనురా, నాయనా ! వెంకటేశ్వర్లువారికి కుంచె డావునేతితో దీపారాధన చేసెదనురా, నాయనా ! యని మనస్సులో వెంకటేశ్వర్లు వారిని దలచుకొని చేతులు జోడించి నమస్కరించి 'నాయనా ! దెబ్బలెక్కడ తగిలినవి? నిన్నెవరు చంపవచ్చిరో యెరుగుదువా?' యని గట్టిగా నడిగెను. అంతలో మొగము మీదకిఁ నెండ బాగుగా వచ్చుటచేతను గ్రామవాసులు చప్పటుల చేతను మొగము, చేతులు, తల్లి మాటి మాటికి పట్టుకొని కదుపుట చేతను గణపతికి మెలఁకువ సంపూర్తిగ వచ్చెను. అంతలో గ్రామవాసులలో నొకడు వచ్చి కట్లు విప్పెను. అంత గణపతి కన్నులు దెరచి చీకు చాపలు, కుండపెంకులు, కచ్చికలు, పంచయనము చేసిన చోటులు, వెదురుముక్కలు మొదలగు వానింజూచి, గుంపులు గుంపులుగా నుండు జనముం జూచి, గుభాలున కటుకుమీఁదనుండి లేచి భయమునకు నాశ్చర్యమునకు లోనై "ఇదేమిటి! మహాదేవశాస్త్రిగారి యరుగుమీఁద పడుకున్న