ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

29

డెన్నఁ డాచరింపలేదని మీ రనఁగూడదు. అతఁడు కొన్ని దానము లప్పుడప్పుడు చేయుచువచ్చెను. అందుముఖ్యమైనవి రెండు కలవు. పితృదేవతలకు పిండప్రదాన మొకటి. తన మిత్రుల కప్పుడప్పుడు డిచ్చు పొగచుట్టలదానము రెండవది. యజ్ఞములు చేయలేదని లోకమున నతనికి నిష్కారణముగ నప్రతిష్ట సంభవించినది. కాని నిష్పక్షపాతముగ నతనిచరిత్ర వ్రాయుదుమేని నతఁ డొక యజ్ఞముఁజేసినాఁడని వ్రాయక తప్పదు. ఆయజ్ఞము నిమిత్తమతఁ డెవ్వరిని బాధింపలేదు. పందిళ్ళు పాకలు వేయలేదు. విశ్వప్రయత్నములు చేయలేదు. యధావిధిగ నతఁడె రెండవ కంటివాఁ డెఱుఁగకుండ జేసెను. అది యెట్లు చేసెనందురోవినుడు: ఆతఁడిరువదియేండ్లు వయస్సుగలవాడై నప్పుడు తల్లి రాత్రిరొట్టె కాల్చుకొనవలయునని మినుపపప్పుచేటలోఁబోసి వాకిటిలో నెండఁబెట్టుకొనెను. ఒక మేఁక యెక్కడనుండియో వచ్చి యాపప్పు దినుచుండెను. చత్వారముచేతఁ తల్లికది కనంబడలేదు. పాపయ్య వీధిలోనుండి వచ్చి యదిచూచి మేఁకను గొట్టుటకు మంచికఱ్ఱ దొరకకపోవుటచే సత్తువకొలఁది నొక్కతన్నుఁ దన్నెను. ఆ మేఁక పదిగజముల దూరమునఁబడి యొక్క యఱపఱచి వెంటనె చచ్చెను. ఆ వార్తవిని మేఁక యజమానుఁడగు గొల్లవాఁడు తన చుట్టములగుంపుతో వచ్చి యింటిమీఁదబడి మేఁకకు జరిగినంతపని పాపయ్యకు చేయవలయు నని సంకల్పించెను.