ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

293

కలదో లోకమునకుఁ దెలియుటకు స్థాళీపులాక న్యాయముగా రెం డుదాహరణము లిచ్చుట మంచిది. ఆ యుదాహరణం బట్టి యతని నిద్రానైపుణ్యమును మీరు కొంతవఱకు గ్రహింపవచ్చును. గణపతి వేసవికాలములో రాత్రులు విశేషమైన యుక్క యుండుటచే నింటిలోఁ బండుకొనక మహాదేవశాస్త్రిగారి వీథి యఱుగులమీఁద బండుకొను చుండును. దీపములు పెట్టిన తరువాత నతఁ డొంటిగాఁ బండుకొనలేడు. కదలలేడన్న మాట చదువరుల కీవఱకే విశదము. అందుచేతఁ దనకు విధేయులయి వివిధోపపచారములం జేయునట్టి పెద్దశిష్యులను నలుగు రైదుగురను బ్రతిదినము రావించి యిరుపుర నీప్రక్కను నిరువుర నాప్రక్కను బండుకొనఁబెట్టి నడుమ దాఁ బండుకొనుచుండును. అట్లు పండుకొనుచుండ నొకనాఁడు గణపతి నిద్రించిన పిదప నలువురు శిష్యులు రెండవ యఱుగుమీఁద కరిగి యా రాత్రి యేదయిన చమత్కారము చేయవలె నని సంకల్పించిరి. ఆ చమత్కృతికిఁ దమ పంతులుగారినే విషయముగాఁ జేయఁదలచు కొనిరి. ఆ చమత్కృతి యే రూపముగ నుండవలయునని ప్రశ్న రాగాఁ గడుసుదనంబునకు దావకం బైన యొక శిష్యుడు తక్కినవారి కిట్లనియె. "ఓరీ! అన్నిటి కన్న మిక్కిలి యందమైన విధము నేను చెప్పెద వినండి. ఏడుకట్ల సవారి కట్టి పంతులవారిని దానిమీద పండుకొన బెట్టి వల్ల కాళ్ల దగ్గరకుఁ దీసికొనిపోయి పెట్టెదము. పంతులవారి నిద్రసంగతి మీకు దెలియునుదగదా! ఆయనకు మెలకువరాదు, ఉదయమున దారింబోవు