ఈ పుట అచ్చుదిద్దబడ్డది

286

గ ణ ప తి

బడవైచి కాలితో త్రొక్కి "నాబడిలో నుండి లేచిపో వెధవా!" యని యరుఁగు మీదనుండి రెండుకాళ్ళు పట్టుకొని క్రిందికి లాగెను. ఆ పిల్లవాడు సహజముగ దుర్బలుఁ డయ్యుఁ చిరకాలమునుండి దెబ్బల కలవాటుపడి యుండుటచే నాటి దినమున నా దెబ్బలకంత స్రుక్కకపోయినను గణపతి నేడిపింపవలయు నని సంకల్పించి గోలపెట్టి యేడ్చి చచ్చిపోవు వానివలె వగర్చుచు నాయాసపడ జొచ్చెను. ఆ కొంటెతన మెఱిగియు గణపతిని వంచింపఁ దలచి తక్కిన బాలురు 'అయ్యో! అయ్యో! మన మందయ్యను పంతులుగారు చంపివేసినారోయి! చచ్చినాఁడోయి, చచ్చినాఁడోయి!' యని పెద్దపెట్టున నేడ్చి కేకలు వేయజొచ్చిరి. అందులో నొకడు చెవులు మూసెను. రెండవవాఁడు మొగమున చన్నీళ్ళు గొట్టెను. మూఁడవవాడు ముక్కు దగ్గర వేలుపెట్టి చూడజొచ్చెను. చుట్టుప్రక్కల నున్న మనుష్యులు పరుగు పరుగున రాజొచ్చిరి. పశులవాడు పశువులను గొట్టినట్లు గణపతి యుపాధ్యాయుడైన నాటగోలె యిచ్చవచ్చి నటుల బాలకుల దండించెను. ఇటువంటి దురవస్థ యెన్నడు గలుగలేదు. ఆ పిల్లవాని యవస్థ జూడగానే గణపతి కమిత భయముకలిగెను. మేనెల్ల చెమటలు గ్రమ్మెను. కాళ్లు గుడ్డపేలికలై శరీరమును భరింపజాలక పోయెను. గ్రామస్తులువచ్చి తన్ను ముక్కముక్కలుగ నరికివేయుదురనియు, లేనియెడల నరహత్య చేసినందుకు దొరతనమువా రురి తీయుదురనియు నతనికి దోఁచెను. ఆ యాపద దప్పించుకొనుట