ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

283

దేవతలే ధనము పండ్లు మొదలగు లంచములు మరిగి భక్తజనుల కుపకారములు చేయుచుండగా పల్లెటూరి పంతులొకఁడు లంచముల కాశపడి విద్యార్థులయెడ నిగ్రహానుగ్రహములు చూపుట యాశ్చర్యమా! ఒకనాఁ డొక పిల్లవాఁడు నాలు గరటిపండ్లు తెచ్చి పంతులుగారికి సమర్పించెను. అవి తిని గణపతి యా దినమున వాని నొక దెబ్బయైన గొట్టలేదు. ఆ పరమ రహస్యము వెంటనే బాలకు లందఱు గ్రహించి గురువు దైవసమానుడు గనుక దైవమున కర్పించినట్లే మరునాటినుండి గురువు గారికి కట్నములు కానుకలు ముడుపులు సమర్పణము జేయఁజొచ్చిరి. వైశ్యబాలకులు బెల్లము పటికబెల్లము పంచదార వక్కలు లవంగములు మొదలయినవి సమర్పింపఁజొచ్చిరి. పంట కాపుల బిడ్డలు పొగచుట్టలు, వీలైనప్పుడు శనగలు కందులు కూరలు మొదలగునవి తెచ్చి యియ్యఁదొడగిరి. బ్రాహ్మణ బాలకులు తలిదండ్రుల నడిగియు, వారీయనప్పుడు గూళ్ళలోను దూలములమీద గదులపెట్టెలలోను దాఁచికొన్నవి దొంగిలించియు డబ్బులు తెచ్చి యియ్యదొడగిరి. ఏదేని వస్తువు నివేదింపఁ బడిననాఁడు విద్యార్థులకు దెబ్బలు తప్పిపోవుటచే, బాలకులు బదులు తెచ్చియొ దొంగిలించియొ తలిదండ్రుల నడిగి తెచ్చియొ యేదో యొకటి పంతులుగారికి సమర్పించి దండనము తప్పించుకొనుచు వచ్చిరి. ఈ పద్ధతి యవలంబించిన తరువాత గ్రామస్తుల యిండ్లలో పెద్దవాండ్రు దాచికొన్న పొగచుట్టలు