ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

275

దీనిని పదకొండు పెట్టి హెచ్చువేయం" డని చెప్పెను. అప్పుడొక పిల్లవాఁడు లేచి "పంతులుగారండి! పందొమ్మిదణాలుండవండి. ఇరువది పైస లుండవండి" యని చెప్పెను. అది విని గణపతి కన్నులు తెఱచి యాపిల్లవాని వంక తేఱిపాఱ జూచి "యోరి తుంటరివెధవా! ఉండవేమి? ఎందు కుండవు? నా కన్న నీ కెక్కువ తెలుసునా? నాలుగు ముక్కలు వచ్చినవో లేదో, యప్పుడే పంతులుగారికే పంగనామాలు పెట్టదలచుకొన్నావా? ఈలాటి వెధవవు నీ వక్కరకు వత్తువటరా?" యని యా దినమున బెత్త మదివరకె విఱిగిపోవుటచే జుట్టు వంగదీసి, చాకలివాడు బట్టలుదికిన తెఱంగున చరుపుమీద చరుపు పడునట్లుగా తనచేయి నొచ్చువరకు గొట్టి, యిటువంటి వెధవలకు లెక్కలే చెప్పనని యూరకుండెను. మఱియొకనాఁడు కునికిపాట్లు పడుచు "ముప్పదియాఱు రూపాయల డెబ్బదియా ఱణాల యఱువది యాఱు పైసలు కలపండి" యని చెప్పెను. "ఒక కచ్చమే చెప్పినారు పంతులుగారూ! రెండవ కచ్చము చెప్పలేదు. ఏలాగున కలపమండి" యని పిల్ల లడిగిరి. అడుగుటయు నతడు కోపోద్దీపితుఁడై యిలాటి వెధవ ప్రశ్నలు వేయకుండ చెంపలు పగులగొట్టెద చూడుండని యొక్కక్కని నాలుగేసి చెంపకాయలు కొట్టి వారి పలకలు వీథిలో గిరవాటులు వైచెను. చాలామంది పలకలు పగిలిపోయెను. పిల్లల తల్లిదండ్రులు సంరక్షకులు వచ్చి పలకలేల పగుల గొట్టినారని గట్టిగా నడుగ గణపతి మీ