ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

273

పోతే వాఁ డెందుకు పనికిరాకపోవును. ఇప్పుడు వాని కెంత భయము వచ్చిన దనుకొన్నారు. నాపేరు వింటే వానికి గడగడ వణకు! నేను నడచుచున్న వీధిలో నడవడు. మొన్నరాత్రి మీ యమ్మగారు చెప్పినారు. అన్నమెక్కువయైనది నేను తినలేనన్నాఁ డట మీవాఁడు. 'పంతులుగారిని పిలవనా, తింటావా?' యని మీ యమ్మగా రడిగినాఁరట. ఆ మాట ననగానే చచ్చినట్లు కంచములో నున్న యన్నమంతయు కిక్కురు మనకుండ తిన్నాఁడట. భయ మనగా నాలాగుండ వలె! ఏఁడీ పిల్లలకు నావలె భయము చెప్పగల పంతులును వేలుమడిచి మరొక్కని చెప్పండి. వెధవ చదువు, కూర్చున్న గుడ్డిముండ చెప్పగలదు! చదువు చెప్పుట కష్టమను కొన్నారా యేమిటి? దాశరథీ యని రెండు కూని రాగాలు తీసి చెప్పగానే సరా యేమిటి? భయము చెప్పాలి, అదీ ప్రజ్ఞ! అదీ సొగసు! పంతులును చూడగానే గజగజ వణికి మూర్ఛపోవాలి, పిల్లవాడు. వాఁడే పంతులు. తక్కినవాఁడు పంతులు మెంతులు పావు శేరు మెంతులు, ఎగరేసి కొడితే యేడు మెంతులు! అలాటి పంతుళ్ళు పనికిరారు. పంతులంటే నేనే పంతులును!" అని ప్రత్యుత్తరము చెప్ప నాతఁడు తెల్లపోయి మాఱుమటాడక తన పిల్లవానిని బడి కంపుట మానెను.

గణపతి బడిలో గూర్చుండు నప్పుడు కునికిపాట్లుపడుచు బాలురకడ పాఠము లప్పగించుకొనును. కునికిపాట్లు పడుచునే చెప్పదలచుకొన్న ముక్కలు చెప్పును. ఒకప్పుడు కునికిపాటు