ఈ పుట అచ్చుదిద్దబడ్డది

272

గ ణ ప తి

కొన్నారో యింతన్నము దిని బాగుపడ్డారో ! లేకపోతే చెడి పోదురు నాకేమి?"

అని తానొక మహావిద్వాంసు డైనట్లు తానా విద్యలు బహుపరిశ్రమచేసి గురువు పెట్టెడి బాధలుపడి నేర్చుకొన్నట్లు కొన్ని కోతలు కోసెను. అతని పాండిత్యప్రభావ మెఱింగినవారు వాని దంభము విని ముసి ముసి నవ్వులు నవ్వుకొని పోయిరి. ఒకనాఁ డొక గ్రామవాసి వచ్చి "పంతులుగారూ! ఏమండీ! మా పిల్లవాడు మీ బడిలో ప్రవేశించి యాఱుమాసములైనది. ప్రవేశించినప్పు డెంత వచ్చెనో యిప్పు డంతె వచ్చెను. మీరు బొత్తిగా పాఠములు చెప్పుట లేదా యేముటి?" యని యడిగెను. అట్టి ప్రశ్నల కుత్తరము గణపతియొక్క జిహ్వాగ్రమందు సిద్ధముగానే యుండునుగదా. "అయ్యా ! మీ వాడు మిక్కిలి యల్లరిపిల్లవాఁడు. ఆ పిల్లవానికి నేను చదువు చెప్పుట కంటె భయము చెప్పుట మంచిదని యాలోచించి చదువు చెప్పుట మాని ముందుగా భయము చెప్పినాను. వెధవ చదు వెంతసేపు వచ్చును? భయము వచ్చుట చాల కష్టము. చదు వనగా మీయభిప్రాయ మెంతో యున్నదనుకొన్నారు కాబోలు. అంత చదువూ నేను నెల దినములలో చెప్పివేయగలను. అదీగాక చదువు మఱియొక పంతులయిన జెప్పగలఁడు. మీ పిల్లవానికి నావలె భయము చెప్ప గలవారు మఱొకరు లేరు. మీ పుణ్యము చేత నేనీయూరు రాబట్టి మీ పిల్లవాడు బాగుపడినాఁడు. లేక