ఈ పుట అచ్చుదిద్దబడ్డది

268

గ ణ ప తి

చేసితి" వని బాదును. ముందుగ వచ్చికూర్చుండినవారిని "వెధవ నీ కేమీ పనిపాటలు లేవటరా, యింటిదగ్గఱ?" యని మోదును. పాఠము తిన్నగఁ జదువని వానిని చదవనందుకు శిక్షించును. గబగబ పాఠ మప్పగించిన వారిని "వెధవ ! వెనకనుంచి నిన్నెవరైన దఱుము చున్నారా, యేమిటి? అంత తొంద రెందు" కని దండించును. పాఠము మెల్లగా నప్పగించినవారిని "గాడిద, నీ వన్నము తినలేదా? లంఖనాలు చేసినావా? మాట హీనస్వరముగ వచ్చుచున్న దేమి? యని తన్నును. పాఠము బిగ్గరగ జదివినవారిని "మొండివెధవ ! నేను చెవిటివాఁడ ననుకొన్నావా యేమిటి? దాకపిడతలాగున నోరు తెఱచి దయ్యపు గొంతుతో ఆలాగున నఱచెద వెందు?" కని దండప్రయోగము చేయును. ఇన్ని మాట లెందుకు. బడిలో నున్నంతసేపు ప్రతిపిల్లవాఁడు తన వీపుమీఁద నిప్పు డప్పు డనక యిందు కందు కనక బ్రతిక్షణము దెబ్బ పడుచున్న దని తలంపవలసినదే. పంతులువారు చాప మీఁద నుంచి లేచిరనఁగానె పిల్లల గుండెలు పీచుపీచు మనుచుండును. దినమునకు నాలుగై దీతబెత్తములు విరుగుచుండును. బెత్తములు విరిగినప్పుడు కలములతో నెత్తురు వచ్చునట్లు పొడుచును. కలములు లేనప్పుడు గంటము మొదలు గూడ నాయుధము లగును. బందుల పలకలు బోడి పలకలు తాటియాకు పుస్తకములు పుస్తకములను గట్టెడి త్రాళ్ళు చీపురుకట్టలు మొదలగున వన్నియు, ధనుర్వేద పారంగతునకు గడ్డిపరకలు మొద