ఈ పుట అచ్చుదిద్దబడ్డది

256

గ ణ ప తి

చోట పిల్లను మాట్లాడి నీకు మరల వివాహము చేసెదను. ఒక వేళ నిన్నెవరైన పిలిచి పిల్లను దొంగతనముగా దీసికొని వచ్చి నీ కెవరు పెండ్లి చేసినారని అడిగిన పక్షమున నా పేరు చెప్పకు. నా కొంప ముంచకు. నాగన్న నా కొంప ముంచగలఁడు. ఏ పొలమో వెళ్ళి వచ్చునపుడు దారిలో నా తల పగుల గొట్టగలఁడు. ఈ మాట గట్టిగా జ్ఞాపకముంచుకో.” అని నొక్కి నొక్కి చెప్పి, తన పేరు బయట పెట్టకుండునట్లు చేతిలోఁ జేయి వేయించుకొని, మరునాఁ డుదయమున నింటికి వచ్చి గణపతి క్షేమముగా నున్నాఁడని శుభవార్త తల్లి కెఱింగించెను. తల్లియుఁ గుమారుని జూడఁ గోరినందున నొక కూలివానిని సాయమిచ్చి యామెను వానపల్లి పంపెను. ఆమెయు గూలివాని సాయమున వానపల్లి చేరి, మహాదేవశాస్త్రి గృహమున కరిగి పోత విగ్రహము వలె వీథి యరుగుఁమీఁద గూర్చున్న కుమారునిఁ జూచి, కౌఁగిలించుకొని యిట్లు విచారించెను. “నా తండ్రీ! పసుపు పారాణి కాళ్ళకు పెట్టుకొని, మొగమున కళ్యాణపు బొట్టు పెట్టుకొని కన్నులకు కాటుకపెట్టికొని బుగ్గను చుక్క బెట్టికొని, పల్లకిలో కూర్చుండగా చూడవలె నని యెంతో అంత ముచ్చటపడితిరా, నాయనా! నా కన్నులు కాలిపోను. ఆ యదృష్టము నాకు లేదురా, నాయనా! తక్కువ నోములు నోచినవారి కెక్కువ ఫలములు వచ్చునటరా, నాయనా! వంశము నిలుచు ననుకొన్నానురా నాయనా! పుల్లయ్య మన కుపకారం చేసినాడు గాని దైవమోర్చలేదురా, నాయనా! ఆ దుర్మార్గపు ముండకొడుకు మంగళసూత్రాలు తెంపి