ఈ పుట అచ్చుదిద్దబడ్డది

252

గ ణ ప తి

గృహస్థాశ్రమముకూడానా? ఆ పాడుముండకొడుకు ఘోటక బ్రహ్మచారియై చావవలసిందే గాని పెండ్లి కానిత్తునా? ఈపెళ్ళి పెళ్ళికాదు. ఆ వెధవ కిది పెండ్లాము కాదు. ఇదిగో! పెండ్లి పెడాకులు చేసినాను. నా కూతురికి నేను తిరిగి పెండ్లిచేయక మానను" అని మంగళసూత్రములు పుటుక్కునఁ ద్రెంచి పాఱవైచెను. అక్కడఁ జేరినవారిలో వద్దు వద్దా పని చేయవద్దని కొందరు, తుంటరిపని చేసినందు కా వెధవ కా శిక్ష కావలసినదే, యని కొందరు, శాస్త్ర మొప్పదని కొందరు, శాస్త్రము లేదు చట్టుబండలు లేవు, దొంగపెండ్లికి శాస్త్రమున్నదా? యని మరి కొందరు దోఁచిన చొప్పున బలుకఁ జొచ్చిరి. ఆ పలుకులువిని నాగన్న యిట్లనియె "ఆ శాస్త్రము చెప్పఁగలవాఁ రెవరో రమ్మను, నాకడుపు మండిపోవుచున్నప్పుడు ఆ శాస్త్ర మెందుకు. మీ శాస్త్రాలు గీస్త్రాలు తుంగలో వూరతొక్కుతాను. శాస్త్రాలు దొంగపెండ్లి చేసుకోమని చెప్పినవా యేమిటి? స్వాములవారు వెలివేసినప్పుడు చూచుకుందాములే. ఇదివరకు నేను నా పిల్ల నెవరి కియ్యదలచుకొన్నానో యతనికే యిచ్చివేసెదను. చూడు నాదెబ్బ. నా కూతురికి తిరిగి పెండ్లిచేయుటేగాదు. గణపతిగాడు కంటికగపడ్డాడా, చంపి, నెత్తురు బొట్టు పెట్టుకొంటా ననుకోండి. నరసింహమూర్తి హిరణ్యకశిపుని చంపి ప్రేగులు మెడలో వేసికొన్నట్లు వాడి ప్రేగులు నేను జందెముగా వేసికొనక మానను. సర్కారువారు న న్నురిదీసినను సరే. ఆ వెధవను నేను చంపక మానను. ఈ మారు వచ్చినాడంటే చచినా డన్నమాటే"