ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

239

కునా ? నిర్భాగ్యుడు గనుక నాగన్న సంబంధము చెడఁగొట్టుకున్నాఁడు. దానికేమి. డబ్బుగొడవ నీ కక్కరలేదు. వానపల్లి దేవాలయములో నీకు నేను వివాహము చేయించగలను. పిల్ల నేదోవిధముగా నేనే తీసుకొని రాఁగలను. అప్పు డప్పు డాపిల్ల మాయింటి ప్రక్కనున్న కందర్పవారి యింటికి వచ్చి యాడుకొను చుండును. ఏదో మచ్చికవేసి పిల్లను తీసికొని రావచ్చును. నేను ముందుగా వానపల్లి వెళ్ళి పురోహితునిఁ గుదిర్చి ముహూర్త మేర్పాటుచేసి పూజారితో మాటలాడి భజంత్రీలను గుదిర్చి వచ్చెదను. బుచ్చి పెండ్లి దశమినాడుగదా తండ్రి యేర్పరిచినాడు. ఈ లోపుగా షష్టినాడో, సప్తమినాడో మనము తలంచుకొన్న పని చేసితీరవలెను. నీవు పంచమినాడే వానపల్లి వెళ్ళియుండు. నేను రేపు వుదయమున బయలుదేరి వానపల్లి వచ్చెదను. పాతిక రూపాయలు సొమ్ము మేనల్లుఁడవు కనుక నీ నిమిత్తము ఖర్చు పెట్టెదను. ఈ సంగతి మట్టుకు నీ వెవరితోను జెప్పవద్దు. మీ యమ్మకుఁ కూడ తెలియనీయవద్దు. ఆడుదాని నోటిలో రహస్యము దాగదు. పూర్వము ధర్మరాజులవారు "ఆడుదాని నోట రహస్యము దాగకూడ" దని కుంతికి శాపమిచ్చినారు. అప్పటినుంచి యాడుదానితో చెప్పిన ఏకాంతము లోకాంత మగును. ఇది మన కిద్దరికె గాని, యీ గ్రామములో మరెవ్వరికిఁ దెలియ గూడదు సుమీ!" అనవుడు గణపతి తన కాపూట వివాహ మైనట్లే మహానందము నొంది లేచి "పుల్లయ్యమామ ! నిజ