ఈ పుట అచ్చుదిద్దబడ్డది

236

గ ణ ప తి

తెచ్చుట యాలస్యమైన పక్షమున, నచ్చట నిల్చియుండక వారి వాకిట మంచ మున్న యెడల మంచముమీఁద, తివాసి యున్న యెడల తివాసిమీఁదఁ, గుర్చీ యున్న యెడల గుర్చీమీఁదఁ గూర్చుండి యాలస్యముగ బిచ్చము దెచ్చినందుకు "ఇంత సేపెందుకు ఆలస్యమైనది? ఎల్లకాలము మీ యింటిదగ్గఱ నేను పడియుందు ననుకొన్నారా యేమిటి? మీరు నాకు నిలువుజీత మిచ్చినట్లున్నారు, నేను మీ వాకిట్లో నిలిచి యుండుటకు ! మీ నౌకరును కాను. పెద్ద మనుష్యుఁడు వచ్చినప్పుడు వెంటనే పంపక యీ యాలస్యమేమిటి?" యని మందలించు చుండును. గణపతి మందలింపులు స్త్రీ పురుషుల కాగ్రహము తెప్పించుటకు మారు మందహాసము సంతోషము గలిగించుచు వచ్చెను. ఈ తెరంగునఁ దల్లి కొన్ని నాళ్ళు, కొడుకు కొన్ని నాళ్ళు, యాయవారము చేసి పొట్ట పోసుకొనుచుండిరి. అంతలో నాగన్న కూఁతురు వివాహము సంభవించెను. వివాహమునకు విఘ్నము లాపాదింప వలె నని గణపతియుఁ దల్లియు బహువిధోపాయములు వెదుకఁ జొచ్చిరి. గణపతి కంటికిఁ గనఁబడిన వారి నెల్ల వివాహము కాకుండఁ జేయుట కుపాయము జెప్పు మని యడుగు చుండును. మేనమామయైన నాగన్నకు సన్నిహిత జ్ఞాతి యొకఁ డుండెను. అతని పేరు పుల్లయ్య. పుల్లయ్యకు నాగన్నకు సరిహద్దు గోడలఁ గూర్చియు, పొలములలో గట్ల గూర్చియు, నీళ్ళబోదెలం గూర్చియు, మనస్పర్థలు పొడమి విరోధములు బ్రబలి