ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

233

"ఓరీ గణపతీ ! మీ తల్లిని పోషింపవలసిన భారము నీది. కుక్కదానము పట్టి కుటుంబము పోషించు మన్నాఁరు. గనుక నీవు యాయవారము చేసి మీకు సరిపడిన బియ్యము తీసికొనిరా ! గ్రామములో నున్న పెద్దమనుష్యులను నల్గురను జూచి మేనమామ నన్ను, నా తల్లిని లేవఁగొట్టినాడని చెప్పు. ఏ ధర్మాత్ములకైన జాలి పుట్టవచ్చును. తలకొక కుంచెడు ధాన్యము వారివ్వవచ్చును. దానివలన మీ కుటుంబ పోషణ గావచ్చును. ముందుగా యావవార మారంభించు. మావారు రామేశ్వర యాత్ర వెళ్ళినప్పుడు కొనితెచ్చిన పెద్ద కుంభకోణపు చెంబున్నది. అది మానెడు బియ్యము పట్టవచ్చును. రేపటినుంచి నీ వభిమానపడక ఆలాగున చెయ్యి, నాయనా ? " యని యుపదేశింప గణపతి యా యుపదేశమునకు సమ్మతింపక యిట్లనియె.

" చెస్! నేను బ్రాహ్మణార్థములే మానివేయఁదలచుకొన్నాను. యాయవారము వృత్తి కొప్పుకొందునా ! అటువంటి మాటలు నాకు పనికిరావు. అమ్మా ! నా కొక యుపాయము తోచింది, విను ! కొద్దిరోజులలో మన మీ యూరు విడిచి వెళ్ళిపోదము. అంతవఱకు నీవు యాయవారము చేసి, బియ్యము తీసుకొనిరా ! ఈ గిరజాలతోను ముచ్చెలతోను నేను యాయవారము చేయుట బాగుండదు. నాకది పరువు తక్కువ. రెండు మూడు మాసము లాలాగు నీవు గడిపితే నేనేదో యుద్యోగము సంపాదించి యొకరికంటె యెక్కువగా నిన్ను పోషింపఁగలుగుదును. అంతవరకు మాటదక్కించు" మని ప్రత్యుత్తరము చెప్పెను.