ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

213

భోజనమునకు వత్తును. వంట చేయ వలసినది" యని చెప్పెను. "సరే" యని మేనత్త యూరకుండెను. ఆ మాట ముసలమ్మతో మరల జెప్పెను. ముసలమ్మ తన కొంపలో నుండి గణపతి వెడలి పోయినందుకు మనస్సులో మిక్కిలి సంతోషించి ప్రేమ ముట్టిపడునట్లుఁ బై కిట్లనియె. "ఓరీ ! గణపతి ! నీవు గుప్పెడన్నము మాయింట తిన్నంత మాత్రమున నాకు లోటు లేదు. నీ యిష్టము ఎక్కడ తిన్నా సరే. నీ యింటికి వెళ్ళుటకు నీ కిష్టము లేకపోయిన పక్షమున మా యింటనే తిను; కాని, దానింటికి వెళ్ళి దాని పొగ రణచవలె. రాఁగానె యీ సంగతులు మీ యమ్మతో చెప్పి మీ మేనమామతో చెప్పి చావగొట్టించు. ఒక్కమాటు జాతరైతేగాని బుద్ధి రాదు. పొగరెక్కి యున్నది. కట్టు పొగరుబోతు. గిద్దెడుప్పు నేను బదులు పుచ్చుకున్నాను. ఇరువదిసార్లు తిరిగి నిలువబెట్టి పుచ్చుకున్నది. ఉప్పు బదులు తీర్చక దీని ఋణమున నుండిపోదునా? దాని బుద్ధి యది చూపించుకొన్నది. గాని, మీ మామతో నేను కూడ చెప్పి ధూపమువేయ తలచుకొన్నాను. నీవుకూడ గట్టిగా చెప్పు. మేనల్లుడంటే ఇంత కిట్టకపోనా? గిట్టని వాళ్లున్నారు. అన్నము పెట్టనివా ళ్లెక్కడా లేరు. దాని సాంప్రదాయ మేలాటిది? దాని బామ్మ పెనిమిటి కన్నము పెట్టక వెళ్లకొట్టింది. ఆ ముసలివాఁడు హోరున నేడ్చి కాశీ రామేశ్వరాలు వెళ్లి యెక్కడనో చచ్చిపోయినాఁడు. ఇందుకే ఆడపిల్లను తెచ్చుకొనేటప్పుడు సాంప్రదాయాలు చూచి తెచ్చుకోవా