ఈ పుట అచ్చుదిద్దబడ్డది

20

గ ణ ప తి

కలలో సాక్షాత్కరించి విష్ణుజిత్తీయ మను నామాంతరముగల యాముక్తమాల్యదను రచియించి తన కంకిత మిమ్నని కోర లేదా, తెలుగుకవులు కావ్యరచనకు ముందు కలలు గనుట సాంప్రదాయ సిద్ధము. కాబట్టి మా కలలో నంత వైపరీత్య మేమియులేదు. కలమాటఁ గట్టిపెట్టి కథాకథనములోకి దిగియెద.

ఆంధ్రకవులు తమకావ్య ముఖములకు మనోహర తిలకంబులై యుండునట్లు గృతిపతుల యొక్కయుఁ గధానాయకులయొక్కయు వంశముల వర్ణించుట సుప్రసిద్ధము. నేనును నాలుగు పద్యము లల్లనేర్చి కొందఱిచేతఁ గాక పోయిన గొందఱచేత నైనను కవి ననిపించుకొనుటచేఁ గవుల సాంప్రదాయ మనుసరింపవలయు నను దృఢసంకల్పము నాకుఁ గల్గినది. అందుచేత నీ కథానాయకుని వంశము ముం దభివర్ణించెద. మా కథానాయకు నది లోకము తగులఁ బెట్టు సూర్యవంశముగాదు. దొంగపోటుగ రాత్రులు తిరుగు మచ్చగల చంద్రవంశము గాదు. ఈ వంశమునకు బ్రహ్మదేవుఁడే మూలపురుషుఁ డగుటచేత నిది పవిత్రమైన బ్రహ్మవంశము. ఆ బ్రహ్మవంశములో నొక్కశాఖ పప్పుభొట్లవా రనుపేరఁ బరగజొచ్చె. ఇది కేవల పౌరుషనామము కాని యూరక పెట్టుకొన్న పేరుకాదు. మా గణపతి పూర్వులలో నొకఁడు పందెమువేసి మూఁడు తవ్వల కందిపప్పు వండించుకొని తానొక్కఁడే భక్షించి మూడు వరహాలు బహుమానముగ