ఈ పుట అచ్చుదిద్దబడ్డది

208

గ ణ ప తి

లకు బోయెను. ఒక్కనాఁడైన వేళ కతఁడు భోజనమునకు రాలేదు. ఒక్క రాత్రియైన నింటఁ బండుకొనలేదు. అట్లు రెండు దినములు చేసిన తరువాత మేనత్త గణపతిం బిలిచి 'యేమోయి ! సరిగా వేళకు భోజనమునకు రావు. చిన్నపిల్లను పెట్టుకొని నేనింట నొకర్తెను పండుకొనజాలకున్నాను' అని మందలించెను. మునుపే మేనత్తపై ద్వేషభావ మూనియున్న యాతని మనస్సున కా పలుకులు ములుకులవలె నాటి నొప్పి కలిగించెను. ద్వేషము ద్విగుణమయ్యెను. అంతమాట తన్నామె యన్నందుకు మరల నామె కేదైన పరాభవము జేయవలెనని సంకల్పము కలిగెను. ఆ విషయమై కొంతసే పతఁడాలోచింపఁజొచ్చెను. ఉపాయము పొడకట్టెను. ఆ యుపాయము భోజనసమయమం దతఁడు ప్రయోగింపఁ దలంచెను. మధ్యాహ్నము భోజనమునకు గణపతికి మేనత్త విస్తరినిండ నన్నము వడ్డించెను. ఉపాయ ప్రయోగమున కదే సమయమని గణపతి చివాలున పీటమీఁద నుండి లేచి విసవిస నడచి వీథిలోనికి బోయి దారిం జనుచున్న యొక బ్రాహ్మణుని బిలిచి లోనికిం దోడ్కొనిపోయి "అయ్యా ! చూడండి. ఈవిడ నా మేనత్త. ఎంతన్నము పెట్టినదో చూడండి ! నేను కుఱ్ఱవాడఁను కదా ! అమ్మవారికి కుంభము పోసినట్లు విస్తరినిండ రాసె డన్నము పెట్టినది. ఇంతన్నము నేను తినగలనా ? ఇది నామీఁద గిట్టక చేసిన పని కాని ప్రేమ చేత చేసిన పనియా? అన్నము తినలేక పాఱవైచిన పక్షమున