ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

19

నామనోభ్రమయా యని నేను కొంతసేపు వితర్కించితిని. నిశ్చయముగ స్వప్నమే యని సిద్ధాంతము చేసితిని. కలలోని వృత్తాంతమును నమ్మి గణపతి చరిత్రమును నేను వ్రాయవలసి యుండునాయని నాలో నేనాలోచించుకొంటిని. వ్రాయుటయే సర్వోత్తమమని నిశ్చయించితిని. వ్రాయకపోయిన పక్షమున నతఁడు పిశాచమై పీడించునను భయమున నే నిది రచియింప సమకట్టలేదుసుడీ. ఎందుచేత నన, నేను దయ్యములు లేవని వాదించు వారలలో నొకఁడను. అట్లయిన నేల వ్రాసితినందురేమో; స్వప్నమం దొక పురుషుఁడు కనఁబడుటయుఁ దన చరిత్రము సంక్షేపముగఁ జెప్పుటయు నది వ్రాయమని కోరుటయు నది యెంతో చిత్రముగ నుండుటయు మొదటికారణము. ఆంధ్రభాషాభిమానము రెండవ కారణము. భారత భాగవత రామాయణాది పురాణములు విని విని చెవులు తడకలు కట్టినవారికి వినోద మేదైన గల్పింపవలయు ననునది మూఁడవ కారణము. ఆంగ్లేయ భాషాభివృద్ది యగుచున్న యీ దినములలో స్వప్నములలో మనుష్యులగపడుట గ్రంథములు వ్రాయమనుట చదువరు లనేకులు నమ్మకపోవచ్చును. నమ్మకపోయిన నా కేమిభయము. ఇది యబద్ధము కాదు గదా! మహాకవియగు తిక్కన సోమయాజికి నతని జనకుఁడగు కొమ్మనదండనాధుడును హరిహర నాధుఁడును స్వప్నమున సాక్షాత్కరించి మహాభారత రచనకుఁ బురికొల్పలేదా, కృష్ణదేవరాయల వారికి శ్రీకాకుళమున నాంధ్రనాయకస్వామి