ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

197

దరమా? యజమానుఁడు తాను కోరిన గుడ్డ లిచ్చినట్లు తానది జంగము చేతి కిచ్చి కుట్టించుకొన్నట్లు, తొడుగు కొన్నట్లు, షికారు చేసినట్లు గూడ నతని కప్పుడే తోఁచెను. ఏ జంగము చేతి కిచ్చి కోటు కుట్టింతునా? యని యాలోచింపఁ దొడంగెను. స్వగ్రామమందున్న కుట్టుపనివాండ్రు పల్లెటూరి వాండ్రగుటచే కత్తిరింపులు సరిగా జేయ లేరనియు, గుట్టు నాజూకుగా నుండదనియు దలచి యాగుడ్డ బట్టుకొని రాజమహేంద్రవరము వెళ్ళి యచ్చట మిక్కిలి సొగసుగాఁ గుట్టు జంగము చేతికిచ్చి కుట్టించుట మంచిదని నిశ్చయించుకొనెను. తక్కిన శ్రాద్ధబోక్తలవలెఁ దాను సైనుగుడ్డ పుచ్చుకొనక తోడి బ్రహ్మచారులచేత గట్టికట్టుకట్టించి తన కోరికె ప్రకారము కోటుగుడ్డలే పుచ్చుకొన గలిగినందుకుఁ దన పంతము నెగ్గించు కొన్నందుకు మిక్కిలి సంతోషించుచు గణపతి యతని వెంటఁ బోయెను. ఆ బ్రాహ్మణుఁ డతనిని యజమానుని యింటిలో మిక్కిలి లోపలి గదిలోనికిఁ దీసికొనిపోయెను. యజమానుఁడు మంచముమీఁద గూర్చుండెను. ఆయన యొద్ద మెరియలవంటి వంటబ్రాహ్మణు లిద్దఱు నిలిచియుండిరి. గణపతి రాఁగానే యజమానుఁ డతనిని జూచి "ఏమయ్యా! కోటుగుడ్డలు రాలేదు. సైనుగుడ్డలు తీసుకొందువా లేదా!" యని యడిగెను. "నాకు సైనుగుడ్డ లక్కఱలే" దని కోపమును గ్రక్కు మొగముతో నిట్లు ప్రత్యుత్తర మిచ్చెను. "అట్లైన నీవిప్పుడేమి చేసెదవు? చేతులు నలుపు కొనుచు వెళ్ళిపో" యని యజమానుఁడు