ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదునొకండవ ప్రకరణము

పదునొకండవ నాఁటి రాత్రి గ్రామచావడి యరుఁగు మీఁద గణపతి మిత్రబృంద సమేతుఁడై పండుకొని నెచ్చెలులతో నిట్లు ప్రసంగించెను.

"ఒరే! యజమానుఁడు కాళ్ళబేరమునకు వచ్చినాడు కాని యతఁ డేదో నాలుగు తుక్కుగుడ్డలు తెప్పించి యివే కోటుగుడ్డలు పుచ్చుకోండి యనునేమో అందుచేత మనము మంచి గుడ్డలు కోరుకోవలెను. ఏ రకము గుడ్డలు బాగుండునో మన మాలోచించుకొనవలెను. చలికాలములో తొడుగుకొనుటకు మంచి బనారసు గుడ్డలు కావలెనని కోరుకొందమా, లేకపోయిన మంచి పట్టుబట్టలు కోరుకొందమా? అతలష్ గుడ్డ లడుగుదమా? ఏ రంగు గుడ్డ లడుగుదము? చారల గుడ్డలున్నవి అందులో తెల్లచారలు నల్లచారలు పచ్చచారలు నెఱ్ఱచారలు గల గుడ్డలున్నవి. మనలో నెవరెవరి కేగుడ్డలు బాగుండునో యవి కోరుకోవలెను. నా మట్టుకు నాకే గుడ్డ బాగుండునో మీరు చెప్పండి!" అనుటయు "ఒరే! గణపతి నీ కెఱ్ఱబనారసు గుడ్డ బాగుండునురా" యని యొకఁడు. "నల్లబనారసు బాగుండునురా, రంగు రంగులో కలిసిపోవు" నని యొకఁడు, "ఒరే చాఱల గుడ్డ బాగున్నదిరా, పెద్దపులిలాగ నుండగల" వని వేఱొకఁడు పలికెను. "ఛీ! మీ సలహాలు నాకు బాగులేవు. నేను పట్టుగుడ్డ కోటు కుట్టించుకొందును. వంగపండు చాయ పట్టుగుడ్డ మీఁద నా కెంత కాలము నుండియో మనసుగా నున్నది. ఆ"