ఈ పుట అచ్చుదిద్దబడ్డది

186

గ ణ ప తి

"ఒరే? మనకు వ్యతిరేకముగ నున్నవారికంటె మనమె యెక్కువమంది యున్నాము. మనము పట్టుపట్టితిమా యజమానుఁడు లొంగి తీరును. నేఁడు పదకొండో దినము. కాబట్టి పది యెనమండ్రుగురు బ్రాహ్మణులు కావలెను. మనము మానివేసితిమా సంఖ్య కుదురదు శ్రాద్ధము చెడును. అందుచేత మీరు మొత్తబడక నేను చెప్పినటులు చేయండి. సైనుగుడ్డలు వద్దోయి, కోటుగుడ్డలు కావలెనోయి యని నేను కనుసంజ్ఞ చేయగానే కేకలు వేయుఁడు. అప్పుడు చచ్చినట్లు మనము కోరిన దిచ్చితీరును. నవరాత్రములలో హాయిగా మంచికోటులు వేసికొని తిరుగవచ్చును. బ్రాహ్మణర్థము చేసినప్పటికి మనము కూడ శుభ్రమైన బట్టలు కట్టుకొని యుద్యోగస్తులవలె నుండవచ్చును. చూడండీ! నేను ముచ్చెలు తొడిగికొని బ్రాహ్మణార్థమునకు వచ్చినాను. ఎవరి వృత్తి వారిది. కూటికి పేదల మైనామని గుడ్డకు పేదలము కానవసరము లేదు. మనదీ శరీరమే; మనకూ ముచ్చట లున్నవి. కాఁబట్టి మనము తప్పక కోటుగుడ్డలే కోరవలెను. జ్ఞాపకమున్నదా? మరిచిపోరుగదా?" అనవుడు వారందఱు 'మరిచిపోము; జ్ఞాపకమున్నది. మీరు చెప్పినట్లే యందు ' మని యరచిరి. వారి మాటల యందు నమ్మికలేక గణపతి వారందఱిచేత గాయత్రీసాక్షి యనియు, దైవసాక్షి యనియు, నిన్ను జంపుకొన్నట్లే, నీ పొగజూచి నట్లే, అమ్మతోడు, బాబుతోడని యొట్లు బెట్టించుకొనెను. పిమ్మట నందఱు స్నానముచేసి, శ్రాద్ధకర్త గృహమున కరిగిరి.